కుల, ధన రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబునాయుడు. అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అన్ని రకాల రాజకీయాలకు బాబు తెరలేపారు. అయితే నాడు కాంగ్రెస్ సంప్రదాయ రాజకీయాలు చేస్తూ…టీడీపీ అధినేత చంద్రబాబును ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడేది. కానీ కాలం మారింది. నీవు నేర్పిన విద్యనే నీరాజాక్షా అనేది కాస్తా నీవు నేర్పిన విద్యే 'నారా'జాక్ష! అయింది.
మరీ ముఖ్యంగా చంద్రబాబు రాజకీయ వ్యూహప్రతివ్యూహాలను అంచనా వేయడంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పైచేయి సాధించారనే చెప్పాలి. సోషల్ ఇంజనీరింగ్‌లో జగన్ సక్సెస్ కావడం వల్లే గత సార్వత్రిక ఎన్నికల్లో అంతటి ఘన విజయం సాధ్యమైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
చంద్రబాబు అధికారంలో ఉంటూ జగన్‌పై ఆయన సామాజిక వర్గానికి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జేసీ బ్రదర్స్, ఆదినారాయణరెడ్డి తదితరులను ఎగదోశారు. అధికారం శాశ్వమని భావించిన టీడీపీ రెడ్డి నాయకులు కూడా రెచ్చిపోయి … జగన్‌పై నోరు పారేసుకున్నారు. చివరికి ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేకపోయారు.
ఇదిలా ఉండగా వైసీపీలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకుల సంఖ్య తక్కువనే చెప్పాలి. ఉన్నవాళ్లతో గుడివాడ ఎమ్మెల్యే నాని చెప్పుకోదగ్గ నాయకుడు. మొదటి నుంచి ఆయన చంద్రబాబుపై ఒంటికాలిపై లేవడాన్ని చూస్తున్నాం. ఇప్పుడాయనకు మరో ఇద్దరు తన సామాజిక వర్గానికి చెందిన నాయకులు తోడయ్యారు. ఆ ఇద్దరూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నాని మాట్లాడుతూ చంద్రబాబు, మాజీ మంత్రి ఉమామహేశ్వరరావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విలేకరుల సమావేశంలో మంత్రితో పాటు పాల్గొన్న నాయకుల్లో వల్లభనేని వంశీ, కృష్ణప్రసాద్ ఉండడాన్ని గమనించొచ్చు.
తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్, వైఎస్సార్ కుటుంబాలు మాత్రమేనని నాని స్పష్టం చేశారు. అలాగే అచ్చెన్నాయుడిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. పైల్స్ ఆపరేషన్‌కు ఎవరైనా 70 రోజులు ఆసుపత్రిలో ఉంటారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మామను చంపి.. చంద్రబాబు, వదినను చంపి.. దేవినేని ఉమా రాజకీయాల్లోకి వచ్చారని విమర్శించారు. తన వదినను చంపారనే ఆరోపణలపై ఇంత వరకూ ఉమా ఎందుకు స్పందించలేదని నాని ప్రశ్నించారు. మొత్తానికి ముగ్గురు కమ్మ నాయకులను కూర్చోబెట్టి, జగన్ కమ్మని రాజకీయం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.