తెలంగాణలో బీజేపీ పప్పులుడుకుతాయా?

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం పొజిషన్ లో ఖాళీ ఉంది. కాంగ్రెస్ ఎప్పుడో కాటికి వెళ్లిపోయింది. ఇప్పుడు చూస్తే తెలుగుదేశం పరిస్థితి కూడా దాదాపు అలానే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడున్న సీట్లు కూడా…

ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం పొజిషన్ లో ఖాళీ ఉంది. కాంగ్రెస్ ఎప్పుడో కాటికి వెళ్లిపోయింది. ఇప్పుడు చూస్తే తెలుగుదేశం పరిస్థితి కూడా దాదాపు అలానే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పుడున్న సీట్లు కూడా వస్తాయనే గ్యారెంటీ లేదు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చేయడానికి, ప్రతిపక్షం స్థానాన్ని ఆక్రమించడానికి గ్యాప్ దొరికింది. మరి తెలంగాణలో బీజేపీకి అంత సీన్ ఉందా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో చంద్రబాబు చేసిన పని వల్ల మహాకూటమి కట్టి కాంగ్రెస్ కు సంఖ్యాపరంగా సీట్లు తగ్గాయి కానీ.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఆదరణ అలానే ఉంది. హస్తం గుర్తుకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ స్థానానికి రావాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ.

ఇది కాస్త కష్టమైన వ్యవహారం అనే విషయం తెలంగాణ బీజేపీకి బాగా తెలుసు. అందుకే ఇప్పుడు కత్తికి రెండు వైపులా పదును పెట్టింది. ఇన్నాళ్లూ కేసీఆర్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న రాష్ట్ర నాయకత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ను కూడా వదలడం లేదు. కేంద్రంలో కాంగ్రెస్ ఇస్తున్న ప్రకటనలకు రాష్ట్ర కాంగ్రెస్ తో ముడిపెట్టి ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.

వాస్తవంగా చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే బీజేపీకి అంతోఇంతో ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఓటు బ్యాంక్ ను పెంచుకోవాలంటే అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం కంటే.. కాంగ్రెస్ ను బద్నామ్ చేయడం ఈజీ అని భావిస్తోంది కమలం. అందుకే ఎత్తుగడలు మార్చింది. ఒకవేళ ఈ ప్రయోగం  ఫలిస్తే.. హార్డ్ కోర్ కాంగ్రెస్ అభిమానులు బీజేపీ వైపు రాకున్నా.. మధ్యతరగతి ఓటర్లు, తటస్థ ఓటర్లు, కాంగ్రెస్-కేసీఆర్ కు వ్యతిరేకంగా న్యూట్రల్ గా ఉన్న మేధో వర్గం తమవైపు వస్తుందని బీజేపీ ఆశ.

తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ-సామాజిక పరిస్థితుల బట్టి చూస్తే.. బీజేపీ ప్రయత్నాలకు పెద్దగా ఫలితాలు కనిపించవు. కాకపోతే ఇదే వ్యూహాన్ని వాళ్లు కొనసాగిస్తే.. మరో మూడేళ్లలో కాంగ్రెస్ కు గట్టి ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలిచే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అయితే కేసీఆర్ హవాను కొట్టాలంటే ఈ వ్యూహాలు సరిపోవు. ఈ విమర్శలతో పని జరగదు. ఈ విషయాన్ని బీజేపీ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

బాలీవుడ్‌లో సినిమా చేయాల‌నే కోరిక లేదు