మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ కింకర్తవ్యం ఏంటి? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
మెరుగైన బిల్లులు తీసుకొచ్చే పేరుతో హైకోర్టు నుంచి మూడు రాజధానుల బిల్లులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో బిల్లులపై హైకోర్టులో రోజువారీ విచారణకు తెరపడింది. ప్రభుత్వం వ్యూహాత్మకంగా బిల్లులను తీసుకొస్తుందని, అంత వరకూ అదే సస్పెన్స్ కొనసాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పు ప్రభుత్వానికి భారీ షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కీలక మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో, తిరిగి వాటిని తీసుకొస్తే, అప్పుడు వాటి సంగతేంటో చూద్దామని న్యాయస్థానం అంటుందని ప్రభుత్వ పెద్దలు ఆశించారు.
ప్రభుత్వ పెద్దల అంచనాలను తలకిందలు చేస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ఆదేశించడంతో పాటు డెడ్లైన్ కూడా విధించడం గమనార్హం.
అసలు రాజధాని విషయమై ప్రభుత్వానికి శాసన అధికారమే లేదని తేల్చి చెప్పడం , ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ. సీఆర్డీఏ చట్టం ప్రకారమే నడుచుకోవాలని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమరావతిలోనే రాజధాని కొనసాగాలని కోరుతూ వేసిన పిటిషనర్లకు న్యాయస్థాన తీర్పు అన్ని విధాలా అనుకూలంగా ఉంది.
ఈ నేపథ్యంలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అసెంబ్లీలో నేడో రేపో తిరిగి మూడు రాజధానుల బిల్లులు ప్రవేశ పెట్టాలని భావిస్తున్న జగన్ సర్కార్ పరిస్థితి ఏంటనే చర్చకు తెరలేచింది.
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుందన్న మాటే గానీ, దాదాపు ఇది తుది తీర్పుగానే న్యాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.
తాజా తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించడమా లేక రాజధాని మార్పుపై వెనక్కి తగ్గడమా? అనే ప్రత్యామ్నాయాలు మాత్రమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎదుట ఉన్నాయి.
మరి జగన్ ఆలోచన ఏంటో ఒకట్రెండు రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.