ఇది ఖాయం.. వైసీపీకి ఆత్మకూరు ఏకగ్రీవం

ఆత్మకూరులో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా అది వైసీపీకి ఏకగ్రీవం ఖాయం. సహజంగా దివంగత నేతల కుటుంబ సభ్యుల్ని ఎన్నికల్లో నిలబెట్టినా బీజేపీ నానా యాగీ చేస్తుంది. కానీ ఆత్మకూరులో అలాంటి సీన్ లేదు.…

ఆత్మకూరులో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా అది వైసీపీకి ఏకగ్రీవం ఖాయం. సహజంగా దివంగత నేతల కుటుంబ సభ్యుల్ని ఎన్నికల్లో నిలబెట్టినా బీజేపీ నానా యాగీ చేస్తుంది. కానీ ఆత్మకూరులో అలాంటి సీన్ లేదు. పిలిచి సీటిచ్చినా బీజేపీ తరపున బరిలో దిగేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. 

గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులపై పోటీ చేసి జనాల్లో పలుచన కావడం కంటే సైలెంట్ గా ఉండటం మేలనుకుంటున్నారు స్థానిక నేతలు. అదే సమయంలో బీజేపీ నాయకులు గౌతమ్ రెడ్డి సంతాప సభల్లో.. వైసీపీ నేతల కంటే ఎక్కువగా ఆయన కీర్తిని పొగిడేస్తున్నారు. దీంతో బీజేపీ వెనకడుగు వేసినట్టు అర్థమవుతోంది. ఇక టీడీపీ, జనసేన కూడా అక్కడ తగ్గినట్టే. అంటే ఆత్మకూరు ఏకగ్రీవం అన్నమాటే.

గౌతమ్ రెడ్డి స్థానంలో ఎవరు..

మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయి. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు, జిల్లా పరిధిలోకి వచ్చే రెండు ఎంపీ సీట్లు కూడా వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. నెల్లూరులో ప్రస్తుతం వైసీపీని ఎదిరించి వేరే పార్టీ గెలవాలనుకోవడం అసాధ్యమే. అయితే ఉప ఎన్నికలంటే కచ్చితంగా ఎన్నికల మూడ్ వస్తుంది. కానీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం, ఆయనకి అజాత శత్రువుగా పేరుండటంతో ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన కుటుంబ సభ్యులకే సీఎం జగన్ సీటు ఆఫర్ చేస్తారని అంటున్నారు.

గౌతమ్ కి ఇద్దరు తమ్ముళ్లున్నారు. వారు బిజినెస్ వ్యవహారాలతో తలమునకలై ఉన్నారు. గౌతమ్ తండ్రి రాజమోహన్ రెడ్డి వయోభారంతో ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం లేదంటున్నారు. గౌతమ్ కొడుకుకి రాజకీయాల్లోకి వచ్చేంత వయసు లేదు. ఇక మిగిలిన ఏకైక ఆప్షన్ గౌతమ్ భార్య శ్రీకీర్తి. ఆమెకు వైసీపీ తరపున టికెట్ ఇస్తారనే ప్రచారం జోరందుకుంది.

గౌతమ్ భార్య శ్రీకీర్తి ఎన్నికల బరిలో దిగితే ప్రతిపక్షాలు కూడా ఏకగ్రీవానికి మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో దివంగత నేత బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వలేదన్న కారణంతో టీడీపీ పోటీ చేసింది, జనసేన బీజేపీకి మద్దతిచ్చింది. బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే భార్యకి టికెట్ ఇవ్వడంతో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది, జనసేన తరపున ఎవరూ ప్రచారానినికి రాలేదు.

ఇప్పుడు ఆత్మకూరు విషయంలో బీజేపీ నేతలు కూడా గౌతమ్ రెడ్డిని అజాత శత్రువుగా కీర్తిస్తున్నారు. సంతాప సభల్లో ఇతర నాయకుల కంటే ఎక్కువగా బీజేపీ నేతలే.. గౌతమ్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడుతున్నారు. వారి వాలకం చూస్తుంటే బీజేపీ కచ్చితంగా పోటీలో దిగదని అర్థమైపోతోంది. గౌతమ్ రెడ్డి భార్యకు వైసీపీ టికెట్ కన్ఫామ్ చేస్తే.. ఎన్నిక లాంఛనంగా మారే అవకాశం ఉంది.