మూడు రాజధానుల విషయంలో మరోసారి కేంద్ర సాయం కోరిన సీఎం జగన్.. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు హోం మంత్రి అమిత్ షాని మద్దతు అడిగారు. ఈ విషయాన్ని ప్రస్తావించే సమయంలో 2019లో ఏపీలో బీజేపీ మేనిఫెస్టోని ఉదహరించారు కూడా.
కర్నూలుని న్యాయ రాజధాని చేసే విధంగా, అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసేందుకు బీజేపీ గతంలోనే నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు మేనిఫెస్టోలో కూడా ఆ అంశాన్ని పొందుపరిచిందని గుర్తు చేశారు జగన్. ఇప్పుడు అదే అంశాన్ని తాము అమలులోకి తెచ్చామని, మూడు రాజధానులు ఏర్పాటు చేశామని వివరించారు.
పాలనా వికేంద్రీకరణ, ఏపీ సమగ్ర అభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించే ప్రణాళిక రూపొందించినట్టు అమిత్ షా కి తెలిపారు సీఎం జగన్. హైకోర్టుని కర్నూలుకి తరలించే ప్రక్రియ ఆరంభించాలని, దీని కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయనను కోరారు.
మూడు రాజధానుల విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదని, అదంతా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమేనంటూ గతంలో కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలు మాత్రం రోజుకో మాట మాట్లాడుతున్నారు.
తాజాగా అమరావతికే కట్టుబడి ఉంటామని, మూడు రాజధానులు వద్దు అంటూ ఏపీ బీజేపీ చీఫ్ వీర్రాజు వ్యాఖ్యలు మరింత కలకలం రేపాయి. ప్రధాని మోదీ ప్రతినిధిగా ఈమాట చెబుతున్నానంటూ వీర్రాజు కాస్త లిమిట్స్ క్రాస్ చేశారు.
దీంతో అసలు మూడు రాజధానులపై బీజేపీ అభిప్రాయం ఏంటనేది సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తరలింపు వ్యవహారాన్ని చాకచక్యంగా ముందుకు జరిపారు జగన్.
కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం జగన్.. అమిత్ షా కోర్టులోనే హైకోర్టు బంతిని నెట్టేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకి నోటిఫికేషన్ ఇవ్వండి అని కూడా అడిగేశారు. అంటే ఇక హైకోర్టు వ్యవహారాన్ని కేంద్రం చక్కబెట్టాలన్నమాట.
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత బీజేపీ నాయకులపై ఉంది కాబట్టి, వారు కూడా ఈ ప్రక్రియలో భాగం కావాల్సిందే. ఇదే లాజిక్ తో అమిత్ షా ని లాక్ చేశారు సీఎం జగన్.
ఇంతకీ అమిత్ షా కేంద్ర హోంశాఖ తరపున నోటిఫికేషన్ విడుదల చేసి ఏపీ హైకోర్టుని కర్నూలుకి తరలిస్తారా..? మేనిఫెస్టో హామీని అటకెక్కించేసి, మాకేం సంబంధం లేదంటూ చేతులు దులుపుకుంటారా..? వేచి చూడాలి.