పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, మొన్నటి వరకూ బీజేపీ మంచి మిత్రుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సంచలన ఆరోపణ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన అధికారిక ట్విటర్ అకౌంట్లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియోను పోస్టు చేశారు.
మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై సిఖ్ రైతుల ఆందోళనల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మత చిచ్చును పెడుతోందని సుఖ్బీర్ వ్యాఖ్యానించారు. పంజాబ్ లో సిఖ్ లపై అక్కడి హిందువులను బీజేపీ ఉసి గొల్పుతోందని సుఖ్బీర్ అన్నారు.
అంతే కాదు.. ఒకవైపు ముస్లింలపై హిందువులను రెచ్చగొట్టి మత రాజకీయం చేస్తున్న బీజేపీ మరోవైపు సిఖ్ లపై కూడా హిందువులను రెచ్చగొట్టే వ్యూహాన్ని అవలంభిస్తోందంటూ ఈ మాజీ సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం.
శిరోమణి అకాళీదల్ కు చెందిన సుఖ్బీర్ బాదల్ మొన్నటి వరకూ బీజేపీకి చాలా సన్నిహితుడు అని వేరే చెప్పనక్కర్లేదు. పంజాబ్ లో బీజేపీ-అకాళీదల్ లు కలిసి పోటీ చేస్తూ వచ్చాయి. మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చాకా అకాళీదల్ కమలం పార్టీకి పూర్తిగా దూరం అయ్యింది.
ఎన్డీయే నుంచి కూడా బయటకు వచ్చింది. రైతుల ఆందోళనల్లో పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాల్గొంటూ ఉంది. అలాగే అకాళీదల్ కూడా తమ మద్దతు రైతులకే అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో రెండు పక్షాలూ బీజేపీ మీద విరుచుకుపడుతూ ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్యన బాదల్ స్పందిస్తూ.. పంజాబ్ లో మత చిచ్చు పెడుతోందని అంటూ బీజేపీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశభక్త పంజాబ్ ను మత జ్వాలలోకి నెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ బాదల్ ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం.
వ్యవసాయ బిల్లులపై రైతుల ఆందోళనల నేపథ్యంలో కూడా అస్సలు తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉంది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాల విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నట్టుగా ఆయన అన్నారు.
అయితే రైతు సంఘాలు కూడా వెనక్కు తగ్గడం లేదు. ఈ పరిణామాల్లో రైతులను తప్పు పడుతూ బీజేపీ భక్తులు హద్దు మీరడానికి కూడా వెనుకడటం లేదు. సీఏఏ ఆందోళనలనల విషయంలో స్పందించినట్టుగానే కొంతమంది రైతుల ఆందోళనల విషయంలోనూ స్పందిస్తున్నారు. ఈ పరిణామాల మధ్యన పంజాబ్ మాజీ సీఎం వ్యాఖ్యలు ఒకింత సంచలనమే.