తిరుపతి ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, బీజేపీ కాస్తా ముందంజలో ఉన్నాయనిపించింది.
అయితే ఎక్కడా ప్రచారం అనే మాటే రాకుండా, తిరుపతి ఉప ఎన్నికను ప్రభావితం చేసేలా సీఎం జగన్ స్ట్రాటజీ రూపొందించారు. ఇందులో భాగమే ఈ నెల 25న చిత్తూరు జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం చుట్టడమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నవరత్నాల్లో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఈ బృహత్తర పథకానికి ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అది కూడా మొట్టమొదటగా చిత్తూరు జిల్లాలోని తిరుపతి లేదా శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ రెండు నియోజకవర్గాలు కూడా తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. త్వరలో ఉప ఎన్నిక జరగనున్న ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మరోసారి విజయాన్ని సాధించేందుకు సీఎం ప్రణాళిక ఏంటో పట్టాల పంపిణీ కార్యక్రమం చెప్పకనే చెబుతోంది.
చిత్తూరు జిల్లాలో సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాల పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
పంపిణీని పేర్తి చేసిన వెంటనే పక్కా గృహాల నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి విడతలో 15 లక్షల పక్కాగృహాలను నిర్మించనున్నట్లు వివరించారు. రెండో విడతలో మిగిలిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయనున్నట్టు మంత్రి వివరించారు.