రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల రద్దుతో ఎంత గొడవ జరిగిందో అందరికీ తెలుసు. పేదవాడి నోటికాడ కూడు లాగేశారని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. తనపై కక్షతో పేదల కడుపుకొట్టడం ఏంటని చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు. సంబంధిత మంత్రి మాత్రం భోజనం సరఫరా చేసే కాంట్రాక్ట్ సంస్థతో ఒప్పందం ముగిసిపోవడంతో తాత్కాలికంగా క్యాంటీన్లు ఆపేశామని వివరణ ఇచ్చారు. అఫ్ కోర్స్ సీఎం జగన్ సహా ఈ వివరణ ఎవరికీ సంతృప్తినివ్వలేదనుకోండి.
ప్రతిపక్షాల రాద్ధాంతం పక్కనపెడితే.. పేదలు కూడా కొన్నిచోట్ల క్యాంటీన్ల మూసివేతతో ఇబ్బందులు పడ్డారనే విషయం మాత్రం వాస్తవం. క్యాంటీన్లపై ప్రత్యేకంగా స్టడీ చేసిన సీఎం జగన్ త్వరగానే ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన ఆస్పత్రుల్లో రోగులు, వారి సహాయకుల కోసం ప్రభుత్వం తరపున వైఎఎస్సార్ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ప్రకటించారు. అలా ఆగిపోయిన అన్న క్యాంటీన్లను జాగ్రత్తగా తెరపైకి తీసుకొచ్చారు జగన్.
ఆస్పత్రుల్లో జనాల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. మందులకే డబ్బుల్లేక అల్లాడిపోయే పేదలు, టిఫిన్, భోజనానికి ఏం ఖర్చుపెడతారు. అలాంటి వారి కోసమే ఈ క్యాంటీన్లు. వీటిని క్రమంగా విస్తరించుకుంటూ పోయే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం రోగులు, వారి సహాయకులకే కాకుండా పేద ప్రజలకి కూడా ఈ క్యాంటీన్లలో భోజనం అందుబాటులో ఉండేలా.. వాటి నిర్వహణ, విధి విధానాలు ఖరారు చేయబోతున్నారట. అంటే క్యాంటీన్ల వ్యవస్థను పరోక్షంగా ఆస్పత్రుల ద్వారా ప్రవేశ పెడుతున్నారు, వాటిని క్రమంగా విస్తరించుకుంటూ పోతారన్నమాట.
తొందరపాటులో తమ ప్రభుత్వం ఏదైనా పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే, వాటిని గుడ్డిగా సమర్థించుకోకుండా సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. ఈ విషయంలో జగన్ మొండిగా కాకుండా తెలివైన నేతలా ఆలోచించారు. అందుకే నెలరోజుల వ్యవధిలోనే క్యాంటీన్ల వ్యవహారానికి చక్కని పరిష్కారం కనిపెట్టారు. ఇకపై అన్న క్యాంటీన్లు మూసివేసి మా పొట్టకొట్టారు అని ఎవరూ అనకుండా మధ్యేమార్గంగా వైఎస్సార్ క్యాంటీన్లను తెరపైకి తెచ్చారు.
ఎవరూ నోరెత్తకుండా విజయవంతంగా పేరు మార్చారు, అవసరం ఉన్నచోట వాటిని ఏర్పాటు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని పూర్తిగా తగ్గించి వేసి, ప్రజలకు ఉపయోగపడేటట్టు ప్రతి పథకానికీ తుది మెరుగులు దిద్దుతున్నారు.