సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటి ముంగిటికి చేరినప్పుడే అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టవుతుందని గాంధీజీ అన్నారు. ఇప్పుడా మాటను నిజం చేసి చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. అధికారిక వికేంద్రీకరణ, గ్రామ సచివాలయం ఆలోచనలను పూర్తిస్థాయిలో అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు జగన్.
స్వతంత్య దినోత్సవం సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించనున్న జగన్, ఈరోజు విజయవాడలో 1500 మంది వాలంటీర్లతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని దాదాపు అన్ని మండల కేంద్రాల్లో మిగతా వాలంటీర్లంతా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.
ఎలాంటి వివాదాలకు తావులేకుండా కేవలం 40 రోజుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వాలంటీర్ల నియమకాల్ని పూర్తిచేశారు. 2 లక్షల 66వేల 796 మంది వాలంటీర్లు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు, గిరిజన ప్రాంతాల్లో ప్రతి 35 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50 లేదా 100 ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించారు. వీళ్లంతా ఈరోజు నుంచి విధుల్లోకి చేరుతారు.
విధుల్లోకి చేరిన వెంటనే వాలంటీర్లు ఏం చేయాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకున్నారు. తనకు కేటాయించిన ఇళ్లల్లో వీళ్లు సమగ్ర సర్వే చేపడతారు. ఈ మేరకు 13 పేజీల సర్వే పుస్తకాన్ని సిద్ధంచేశారు. ఇప్పటికీ ఈ సర్వే పుస్తకాల పంపిణీ పూర్తయింది. బేస్ లైన్ సర్వే ముగిసిన తర్వాత అసలైన పథకాల అమలు, ఇంటింటికి చేరవేసే కార్యక్రమం షురూ అవుతుంది.
మరోవైపు ఈ మొత్తం సర్వే వివరాల్ని కంప్యూటర్ లో క్రోడీకరించి, నిరంతరం జగన్ పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. అంతేకాకుండా… ఎవరైనా, ఎప్పుడైనా ప్రతి కుటుంబానికి అందుతున్న పథకాలు, చేకూరుతున్న లబ్దికి సంబంధించిన వివరాల్ని ఆన్ లైన్ లో చూసుకోవచ్చు.
ఈ పథకం సమగ్రంగా అమలైతే ఇక కలెక్టర్ ఆఫీసులు, ఎమ్మార్వో కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండదు. బేస్ లైన్ సర్వే ఆధారంగా ఎవరికి అందాల్సిన పథకాలు వాళ్లకు ఆటోమేటిగ్గా చేరిపోతాయి.