అధికారంలోకి వచ్చి 6 నెలలే అయింది. ఎన్నో సంచలనాలు, మరెన్నో విప్లవాత్మక నిర్ణయాలు. మేనిఫెస్టోనే ఎజెండా, సంక్షేమమే కొలమానం. ఇలా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న సీఎం జగన్ మరో అద్భుత విజయాన్నందుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని, సత్ఫలితాలు ఇవ్వదని అటు ప్రతిపక్షాలతో పాటు విశ్లేషకులు కూడా భావించిన మద్యపాన నిషేధంలో మెరుగైన గణాంకాలు సాధించి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు సీఎం.
అవును.. మద్యపాన నిషేధంతో చెప్పుకోదగ్గ పురోగతి సాధించారు సీఎం. మే-అక్టోబర్ నెలల మధ్య మద్యపానం 47.87 శాతానికి పడిపోయిందంటే అది కచ్చితంగా జగన్ సాధించిన విజయమే. ముఖ్యమంత్రి తీసుకున్న కఠిన నిర్ణయాల వల్లనే మద్యపానం ఇంతలా తగ్గింది. ఇక రెవెన్యూ పరంగా చూసుకుంటే.. గతేడాది అక్టోబర్ లో 1701 కోట్ల రూపాయల ఆదాయం ఉండగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి అది 1038 కోట్లకు పడిపోయింది.
ఓవైపు రాష్ట్ర ఆదాయం తగ్గుతున్నప్పటికీ, జగన్ వెనకడుగు వేయడం లేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు పూర్తి మద్యపాన నిషేధం దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం రేట్లు షాక్ కొడతాయని కూడా స్పష్టంచేశారు సీఎం. గుంటూరులో ఈరోజు జరిగిన ఓ కార్యక్రమంలో మరోసారి మద్యపాన నిషేధంపై తన వైఖరిని స్పష్టంచేశారు.
“43 వేల బెల్ట్ షాపులు రద్దుచేశాం. ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా చేశాం. ఎక్కడా పర్మిట్ రూమ్స్ లేవు. 4500 మద్యం షాపుల్ని, 3500 షాపులకు తగ్గించేశాం. మద్యం షాపుల దగ్గర టైమింగ్స్ పెట్టాం. 8 దాటితే షాపులు క్లోజ్. ఈ విషయంలో లాభాపేక్ష లేదు. అందుకే ప్రైవేటును తీసేశాం. పూర్తిగా ప్రభుత్వం తీసుకుంది. 40 శాతం బార్లను తీసేయబోతున్నాం. రేట్లు షాక్ కొట్టే విధంగానే ఉంటాయి. అలా చేస్తేనే ఆరోగ్యం బాగుపడుతుంది.”
బార్లకు సంబంధించి లైసెన్స్ ఫీజును ఇప్పటికే రెట్టింపు చేశారు. బార్లలో మద్యం ధరలు కూడా పెంచారు. ఓవైపు ఇలా బార్లను కట్టడి చేస్తూనే, మరోవైపు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే దుకాణాల్ని కూడా క్రమంగా తగ్గించాలని భావిస్తున్నారు జగన్. ఇలా రాబోయే రెండేళ్లలో సంపూర్ణ మద్యనిషేదాన్ని సాధించాలనేది ముఖ్యమంత్రి ప్రణాళిక.
గతంలో ఎన్టీఆర్ హయాంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలుచేశారు. అయితే దాన్ని అమలుచేయడానికి దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకున్నారు ఎన్టీఆర్. అది ఇలా అమలవ్వడం, ఆ వెంటనే చంద్రబాబు అధికారం లాక్కొని మద్యపాన నిషేధాన్ని ఎత్తేయడం చకచకా జరిగిపోయాయి. జగన్ మాత్రం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మార్పు తీసుకొచ్చారు. కచ్చితంగా ఇది జగన్ సాధించిన విజయమే.