ఇది కరోనా మహమ్మారి కాలం. దేశమంతా విపత్తు నెలకుంది. ముఖ్యంగా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉపాధి పోయి రోడ్డున పడుతున్న దయనీయ స్థితి. ఈ మహమ్మారి ఎప్పటికి అంతమవుతుందో తెలియక, కనుచూపు మేరలో ఉపాధి మార్గం కనిపించక …జీవితం అంధకారమైన దయనీయ స్థితి.
ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు నిరుద్యోగులకు అండగా నిలిచి మానవ త్వాన్ని చాటుకోవాలి. కానీ జగన్ సర్కార్ విపరీత పోకడలకు వెళుతుండడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రత్యర్థుల పరిశ్రమలను ఎలా మూసివేయాలనే దానిపై జగన్ సర్కార్ శ్రమిస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లో ఉన్న సీబీఐ, ఈడీ సంస్థలను ఎగదోసి టెర్రరైజ్ చేస్తుండడం తెలిసిందే. బహుశా జగన్ సర్కార్ కూడా మోడీ సర్కార్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టుంది. తన ప్రత్యర్థికి చెందిన పరిశ్రమలపైకి కాలుష్య నియంత్రణ మండలిని ఉసిగొల్పుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. మరోవైపు సమయం, సందర్భం చూసుకోకుండా పరిశ్రమలను మూసివేస్తూ ఉద్యోగుల్లో భయాందోళనలు సృష్టిస్తుండడంపై పౌర సమాజం నుంచి వ్యతిరేకత వస్తోంది.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజక వర్గంలోని ఎర్రగుంట్ల సమీపంలో జువారీ సిమెంట్ ఫ్యాక్టరీని నాలుగు రోజుల క్రితం, అలాగే చిత్తూరు జిల్లాలోని అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసి పరిశ్రమలను మూసివేయడంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ రెండు పరిశ్రమలు కూడా వెనుకబడిన రాయలసీమలో ఉండడం గమనార్హం.
ప్రభుత్వం వాదిస్తున్నట్టు ఈ రెండు పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించాయని అనుకుందాం. అయితే కరోనా మహమ్మారి పంజా విసురుతున్న విపత్కర పరిస్థితుల్లో తాత్కాలికంగానైనా మూసి వేయడం వల్ల వేలాది మంది కార్మికులు అభద్రతా భావానికి గురి అవుతారనే కనీస స్పృహ ప్రభుత్వానికి ఎందుకు లేకపోయిందో అర్థం కాదు.
ముఖ్యంగా అమరరాజా బ్యాటరీస్ పరిశ్రమ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందినది. దీనికి సంబంధించి కరకంబాడి, నూనెగుండ్లపల్లిలో రెండు యూనిట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమలపై ప్రత్యక్షంగా 20 వేల మంది ఉద్యోగులు, పరోక్షంగా మరో 50 వేల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ పరిశ్రమ విస్తరణకు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో చేయూతనిచ్చారు. అందువల్లే వేలాది మందికి ఉద్యోగాలు దక్కాయి.
అలాగే జువారీ యాజమాన్యంపై ప్రత్యక్షంగా 1000 మంది ఉద్యోగులు, పరోక్షంగా 2 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తు తం వారం నుంచి ఇక్కడ ప్రొడక్షన్ నిలిపేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) నుంచి వెళ్లిన నోటీసులకు ఈ పరిశ్రమ ఉన్నతాధికారులు సమాధానం ఇవ్వకపోవడం వల్ల కూడా పరిశ్రమ మూసివేతకు కారణమని తెలుస్తోంది.
పీసీబీ ఇచ్చిన క్లోజర్ నోటీసులో …ఈ సంస్థకు సంబంధించి చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడిల్లో ఉన్న యూనిట్లు పర్యావరణ అనుమతులు (ఈసీ), ఆపరేషన్ నిర్వహణ సమ్మతి (సీఎఫ్‌వో)లో విధించిన షరతులు ఉల్లంఘించినందున వాటి మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు అమరరాజాకు ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరా నిలిపి వేసింది. దీంతో పరిశ్రమలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కారణంగా శాశ్వతంగా పరిశ్రమ ఎక్కడ మూసివేతకు గురవుతుందోనని వేలాది కుటుంబాల్లో ఆందోళన నెలకుంది.
అధికారంలోకి వచ్చిన ఈ 23 నెలల్లో కొత్త పరిశ్రమలు స్థాపించింది ఎన్ని? అందులో ఎంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించారో ఎవరికీ తెలియదు. కానీ పదేపదే ఉన్న పరిశ్రమలపై జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలకు తాజా ఘటనలు మరింత బలాన్ని ఇస్తున్నాయి.
కనీసం విపత్తునైనా పరిగణలోకి తీసుకుని ఇలాంటి చర్యలకు జగన్ సర్కార్ దిగకుండా ఉండాల్సిందనే అభిప్రాయాలు సొంత పార్టీ నుంచి వస్తున్నాయి. ఇప్పటికైనా జగన్ సర్కార్ విపరీత పోకడలకు స్వస్తి చెప్పి, పది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ అది చేతకానప్పుడు కనీసం ఉన్నవైనా పోగొట్టుకుండా ఉంటే అదే పదివేలు.
సొదుం రమణ