తెలంగాణతో తాడో పేడో.. తగ్గేది లేదంటున్న జగన్!

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వంక పెడుతూ, ఏపీకి నీటి తరలింపుని తప్పుడు పథకం అంటూ రభస చేస్తున్న తెలంగాణ మంత్రులకు గట్టి షాక్ ఇచ్చేందుకు డిసైడ్ అయింది ఏపీ కేబినెట్.  Advertisement శ్రీశైలం డ్యాంలో…

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వంక పెడుతూ, ఏపీకి నీటి తరలింపుని తప్పుడు పథకం అంటూ రభస చేస్తున్న తెలంగాణ మంత్రులకు గట్టి షాక్ ఇచ్చేందుకు డిసైడ్ అయింది ఏపీ కేబినెట్. 

శ్రీశైలం డ్యాంలో నీరు తక్కువగా ఉన్నా.. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రాంతానికి నీటిని తరలించుకుపోవడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుబట్టింది. దీనిపై ఇప్పటికే కృష్ణానది యాజమాన్య బోర్డుకి లేఖ రాసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. 

యధావిధిగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని తరలిస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం మరోసారి కృష్ణా యాజమాన్య బోర్డుకి లేఖ రాయాలని, ప్రధాని మోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించింది.

రాయలసీమకు నీరు ఇవ్వరా..?

కృష్ణాకు వరద పోటెత్తినప్పుడు, శ్రీశైలం డ్యాంలో సంతృప్త స్థాయిలో నీరు నిల్వ ఉన్నప్పుడు.. మిగులు జలాలను వాడుకునే ఉద్దేశంతో రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తొలి నుంచీ తెలంగాణ అడ్డుపుల్లలు వేస్తూనే ఉంది. 

డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వలేదన్న కారణాన్ని సాకుగా చూపెడుతూ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవాలంటూ కృష్ణాబోర్డుకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసు వేసింది. డీపీఆర్ ఆమోదం పొందాల్సిందేనని, కృష్ణానది యాజమాన్య బోర్డు లెక్కల ప్రకారం నీటి కేటాయింపులుండాలని ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది.

ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా దీనిపై ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నాయంటూ మరోసారి తెలంగాణ ప్రభుత్వం హడావిడి మొదలు పెట్టింది. 

మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ఈ దశలో ఏపీ ప్రభుత్వం సంయమనం పాటించింది. అయితే అంతలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా శ్రీశైలం నుంచి చేతివాటం ప్రదర్శించింది. జలవిద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని తరలించుకుపోతోంది.

దీనిపై ఇప్పుడు ఏపీ కేబినెట్ తీవ్ర స్థాయిలో మండిపడింది. రాయలసీమ డీపీఆర్ తో పాటు, కృష్ణానదిపై తెలంగాణలో చేపడుతున్న అన్ని ప్రాజెక్ట్ లపై సమగ్ర పరిశీలన చేయాలంటూ కృష్ణా నది యాజమాన్య బోర్డుని కోరింది. ఇప్పుడు జలవిద్యుత్ పేరుతో జరుగుతున్న జలచౌర్యంపై మరోసారి ఫిర్యాదు చేయబోతోంది. 

అవసరమైతే ప్రధాని వద్ద పంచాయితీ పెట్టడానికి సైతం సిద్ధమేనంటూ జగన్ కాస్త ఘాటుగానే కేబినెట్ భేటీలో స్పందించారని తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రాంత ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో, మౌనంగా ఉండాల్సి వస్తోందని, రైతుల భవిష్యత్ కోసం తాము కూడా గట్టిగా పోరాడతామని అన్నారాయన.

ఇక రాష్ట్రంలో 9, 10, ఇంటర్ విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ ల పంపిణీ సహా.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ కేబినెట్. ఒంగోలులో ఆంధ్రకేసరి వర్శిటీ ఏర్పాటుకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని వర్శిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. టిడ్కో ద్వారా 2,62,216 ఇల్ల నిర్మాణం పూర్తిచేసేందుకు కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 2021-24 ఐటీ విధానానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.