ఎద్దు ఈనింది-దూడను గాటిన కట్టేయమని వెనుకటికి ఎవరో చెప్పారట. ఆ దూడను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లాంటి వారే గాటిన కట్టేసినట్టున్నారని తాజాగా ఆయన ట్వీట్‌పై సెటైర్లు పేలుతున్నాయి. ఎవరో ఏదో అంటే, రాస్తే, కనీసం విచక్షణ లేకుండా ట్విటర్ వేదికగా దాన్ని పట్టుకుని వ్యంగ్యంగా ట్వీట్ చేయడం లోకేశ్‌కే మాత్రమే చెల్లిందనే విమర్శలు, దెప్పిపొడుపులు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఓ ఎల్లో మీడియాధిపతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ అర్ధరాత్రి వేళ జీసస్‌తో, అలాగే తన తండ్రి దివంగత వైఎస్సార్ ఆత్మతో మాట్లాడతారని రాసి పౌర సమాజం నుంచి ఈసడింపులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు మీడియాధిపతి కామెంట్స్‌ను వేదవాక్కుగా భావించిన చంద్రబాబు తనయుడు లోకేశ్ ఓ ట్వీట్ చేశారు.
‘ఏపీ సీఎం జగన్ ఆత్మలతో కాకుండా అంతరాత్మతో మాట్లాడి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి. జగన్ అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడ్డం కాసేపు ఆపి మంత్రులు, అధికారులతో మాట్లాడితే కొంత వరకైనా వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులను నిలువునా ముంచేసిన ‘జాబ్‌లెస్’ క్యాలెండర్ రద్దు చేయాలి. పాదయాత్రలో హామీ ఇచ్చినట్టు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
ఆత్మలతో, అంతరాత్మలతో వైఎస్ జగన్ మాట్లాడ్డం తర్వాత సంగతి. ముందు తన పార్టీ ఘోర పరాజయానికి కారణాలేంటో తండ్రీతనయులిద్దరూ ఒక్కసారి తమ అంతరాత్మలతో మాట్లాడాల్సిన అవసరం ఉందని నెటిజన్లు సూచిస్తున్నారు.
చిల్లరమల్లర కామెంట్స్ ఆధారంగా ట్వీట్ చేయడం ద్వారా తన స్థాయిని తానే తగ్గించుకున్నట్టు అవుతుందని హితవు చెబుతున్నారు. కాస్త హూందాగా , విధానాల పరంగా మాట్లాడితే గౌరవం ఉంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు.