టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన వెంటనే రేవంత్ రెడ్డి తన మాటలకు పదును పెట్టారు. కేసీఆర్, కేటీఆర్ ను వదలకుండా విమర్శలు చేస్తున్నారు. ఈ దూకుడుని అడ్డుకోవాలంటే ప్రస్తుతం కేసీఆర్ దగ్గరున్న ఒకే ఒక్క అస్త్రం ఓటుకు కోట్లు కేసు. చంద్రబాబు చేసిన పాడు పనికి వీడియోల్లో అడ్డంగా బుక్కయిన రేవంత్ రెడ్డి, ఆ కేసును వదిలించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వదిలించుకోవడం కూడా కష్టం. ఎందుకంటే, ''బ్రీఫ్డ్ మీ'' అంటూ వీడియో సాక్ష్యాలు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి మరి.
ఆ కేసు తర్వాత రేవంత్, టీడీపీని వీడడం, కాంగ్రెస్ లో చేరడం, ఇప్పుడు ఏకంగా టీపీసీసీ చీఫ్ అవడం చకచకా జరిగిపోయాయి. అయితే రోజురోజుకు తమకు పక్కలో బల్లెంగా మారుతున్న రేవంత్ కు చెక్ చెప్పడానికి కేసీఆర్ ఈ కేసును తిరగదోడాలని భావిస్తున్నారట. అదే జరిగితే రేవంత్ దీన్ని ఎలా ఎదుర్కొంటారనేది చర్చనీయాంశం. రేవంత్ కు కొత్త పదవి వచ్చిన నేపథ్యంలో.. ఓటుకు కోట్లు కేసుకు మరోసారి ఊపొచ్చిందంటున్నారు విశ్లేషకులు.
సరిగ్గా ఇదే నెలలో ఓటుకు కోట్లు కేసు వ్యవహారంలో రేవంత్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. ఆ కేసు ఏసీబీ పరిధిలోది కాదని, దానిపై ఎన్నికల కమిషన్ విచారణ జరపాలంటూ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అదే పిటిషన్ ను ఆయన ఏసీబీ కోర్టులో దాఖలు చేయగా.. దాన్ని కొట్టివేశారు.
ఆ తర్వాత హైకోర్టు కూడా విచారణ జరపకుండానే పిటిషన్ ను తిరస్కరించడం అప్పట్లో రేవంత్ కి పెద్ద ఎదురు దెబ్బగా భావించారు. నెల తిరక్కుండానే టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టిన రేవంత్ కు ఆ కేసుతో చుక్కలు చూపించాలనుకుంటున్నారట టీఆర్ఎస్ అధినేత.
అసలేంటీ కేసు..?
2015లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకోడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బుల ఎర వేశారు. 50లక్షల క్యాష్ తో ఆయన ఇంటికి వెళ్లారు. వీడియోల్లో ఈ విషయం స్పష్టంగా రికార్డ్ అయింది. అదే వీడియోలో చంద్రబాబు వాయిస్ కూడా వినిపించింది. స్పాట్ నుంచి చంద్రబాబుతో స్పీఫెన్ సన్ కి ఫోన్ చేయించారు రేవంత్ రెడ్డి.
మనవాళ్లు బ్రీఫ్డ్ మి అంటూ.. బాబు స్టీఫెన్ సన్ కు హామీ కూడా ఇచ్చారు. అయితే పక్కా ఆధారాలు లేకపోవడంతో బాబు ఈ కేసు నుంచి తప్పించుకోగలిగారు. డబ్బులు ఇచ్చేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఏ-1 అయ్యారు. సెబాస్టియన్, ఉదయసింహ.. మిగతా నిందితులుగా ఉన్నారు. చంద్రబాబుని తప్పించేందుకు రేవంత్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నా.. ఆ కేసు ఓ కొలిక్కి వచ్చేసరికి బాబు బండారం బయటపడక మానదు.
రేవంత్ కే కాదు, బాబుకీ తిప్పలే..
ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు తన ఫోన్లును తెలంగాణ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపిస్తూ.. హైదరాబాద్ నుంచి వచ్చేశారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా కూడా.. దాన్ని వదిలిపెట్టి కరకట్టకు పారిపోయారు. అప్పటినుంచి ఆ కేసు హియరింగ్ కి వస్తుందంటే చాలు చంద్రబాబు వణికిపోతారు.
రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉన్నా కూడా ఎక్కడ తన పేరు బయటకు వస్తుందోనని భయపడిపోవడం బాబుకి అలవాటైంది. అలాంటి సంచలనమైన కేసుపై కేసీఆర్ ఇప్పుడు మరోసారి దృష్టి పెట్టే అవకాశం ఉంది.