కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపత్యం పంచాయితీ చివరికి హైకోర్టుకు చేరింది. ఇటీవల మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నేతృత్వంలో జరిగిన పెద్ద మనుషుల పంచాయితీలో పీఠాధిపతి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. ఈ విషయంలో పెద్దగా వివాదాలకు ఆస్కారం లేకుండా సమస్య ఓ కొలిక్కి వచ్చిందని ప్రభుత్వం ఊపిరి పీల్చు కుంది.
అయితే దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో, వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. పెద్దమనుషుల రాజీ చర్చల్లో తనను బలవంతంగా ఒప్పించారని ఆమె హైకోర్టులు పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
నాలుగు రోజుల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన చర్చల్లో …పీఠాధిపతిగా పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, రెండో కుమారుడు వీరభద్రస్వామిని ఉత్తరాధికారిగా ఎంపిక చేశారు. అలాగే రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారుడు ప్రస్తుత వెంకటాద్రి స్వామి అనంతరం పీఠాధిపతి అయ్యేట్టు ఒప్పందం జరిగింది.
ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. పీఠాధిపతి బాధ్యతల స్వీకరణ అట్టహాసంగా చేపట్టాలని కూడా నిర్ణయించారు. అయితే అంతా ప్రశాంతంగా జరిగిపోయిందని భావిస్తున్న తరుణంలో రెండో భార్య హైకోర్టును ఆశ్రయించడం…ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ అని చెప్పొచ్చు.
పీఠాధిపత్యం విషయంతో తనపై ఒత్తిడి తెచ్చి అంగీకరించేలా చేశారంటూ మారుతి మహాలక్ష్మమ్మ ఆరోపిస్తున్నారు. మరోవైపు దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లె శ్రీనివాస్‌కు, ఆ శాఖ అధికారులకు రెండో భార్య మారుతి లేఖ రాశారు.
వెంకటాద్రి స్వామి నియామకానికి తనను బలవంతగా ఒప్పించారని.. కేవలం ఒత్తిడి తేవడం వల్లే తాను నియామపు అగ్రిమెంటుపై సంతకం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. వెంకటాద్రిస్వామి నియామకం రద్దు చేసి తమకు న్యాయం చేయాలని లేఖ ద్వారా మారుతి మహాలక్ష్మి కోరడం గమనార్హం. ఈ నేపథ్యంలో చివరికి ముగింపు ఎలా వుంటుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకుంది.