భుజంపై కూతురు.. సూట్ కేసులో భార్య డెడ్ బాడీ

సంచలనం సృష్టించిన 'సూట్ కేసులో కాలిన శవం' కేసును తిరుపతి పోలీసుల ఛేదించారు. కాలిన మృతదేహాన్ని ఐటీ ఉద్యోగి భువనేశ్వరిదిగా గుర్తించారు. ఆ హత్య చేసింది స్వయంగా ఆమె భర్త అనే విషయాన్ని కనుగొన్న…

సంచలనం సృష్టించిన 'సూట్ కేసులో కాలిన శవం' కేసును తిరుపతి పోలీసుల ఛేదించారు. కాలిన మృతదేహాన్ని ఐటీ ఉద్యోగి భువనేశ్వరిదిగా గుర్తించారు. ఆ హత్య చేసింది స్వయంగా ఆమె భర్త అనే విషయాన్ని కనుగొన్న పోలీసులు, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..!

కడప జిల్లా బద్వేలుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి, చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరి ప్రేమించుకున్నారు. అందర్నీ ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. భువనేశ్వరి మంచి జాబ్ చేస్తోంది. ఆమెకు నెలకు 90వేల రూపాయల జీతం. శ్రీకాంత్ రెడ్డి మాత్రం ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా అవినీతి నిర్మూలన అంటూ ఓ నకిలీ సంస్థను స్థాపించి స్థానికంగా చాలామందిని మోసం చేశాడు.

ఆ తర్వాత భార్య సంపాదనతో జల్సాలు మొదలుపెట్టాడు. బంధువుల్ని అప్పులు అడగాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చేవాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయి. 22వ తేదీన ఆ గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో నిద్రిస్తున్న భార్య ముఖంపై దిండు పెట్టి భువనేశ్వరని హత్య చేశాడు శ్రీకాంత్.

మరుసటి రోజు ఓ పెద్ద సూట్ కేసులో భార్య మృతదేహాన్ని కుక్కి, రెండేళ్ల కూతురుతో ఊరికి వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. తను ఊరికి వెళ్తున్నానని, పక్కింటావిడకి కూడా చెప్పి టాక్సీ ఎక్కుతాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. అలా బయల్దేరిన శ్రీకాంత్ రెడ్డి, తిరుపతి రుయా ఆస్పత్రి ప్రాంగణంలో సూట్ కేసు పడేశాడు. ఆ తర్వాత దానిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి పోలీసులు చురుగ్గా దర్యాప్తు మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ రెడ్డి, పాపను రామసముద్రంలోని అమ్మకి అప్పగించి పరారయ్యాడు. పోలీసులు వలపన్ని నెల్లూరులో శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు చిక్కిన శ్రీకాంత్ నేరం అంగీకరించాడు. జరిగిందంతా పూసగుచ్చినట్టు పోలీసులకు వివరించాడు.