ఉపాద్యాయ సంఘాల ఆందోళ‌నపై సీఎం ఘాటు వ్యాఖ్య‌లు

ఇన్నాళ్లూ పీఆర్సీ రగడపై జగన్ మాట్లాడలేదు.. మాట్లాడలేదు అని గింజుకునేవారికి.. ఓ స్ట్రాంగ్ కౌంటర్ పడింది. ఉపాధ్యాయ సంఘాల ఆందోళనపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో టీచర్లు రోడ్డెక్కితే…

ఇన్నాళ్లూ పీఆర్సీ రగడపై జగన్ మాట్లాడలేదు.. మాట్లాడలేదు అని గింజుకునేవారికి.. ఓ స్ట్రాంగ్ కౌంటర్ పడింది. ఉపాధ్యాయ సంఘాల ఆందోళనపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో టీచర్లు రోడ్డెక్కితే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. 

విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెబుతారని అడిగారు. జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా చేతివృత్తులవారికి ఆర్థిక సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేసిన జగన్.. ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఈసారి వామపక్షాలను కూడా కలుపుకుని అందరికీ చాకిరేవు పెట్టారు.

పీఆర్సీపై జరిగిన చర్చల్లో సంతోషాన్ని వెలిబుచ్చి, సంతకాలు పెట్టిన తర్వాత ప్రతిపక్షాలు ఉపాధ్యాయుల్ని రెచ్చగొట్టాయని అన్నారు జగన్. ఎర్ర పార్టీలు, పచ్చపార్టీలకు చెందిన యూనియన్లు రోడ్డెక్కుతామని అనడం బాధాకరం అని చెప్పారు. 

ఎదుట ఎర్రజెండా, వెనక పచ్చజెండా అన్న చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలు వద్దంటూ కోర్టు కెక్కిన చంద్రబాబు కామ్రేడ్లకు మిత్రుడు అయ్యాడని అన్నారు సీఎం. చంద్రబాబుకి, ఎల్లో మీడియాకి మాత్రమే సమ్మె కావాలని, సీఎంని తిడితే బాగా కవరేజ్ వస్తుందని ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని చెప్పారు.

ఎస్సీ కులంలో ఎవరూ పుట్టాలని కోరుకోరంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు జగన్. బీసీలు జడ్జిలుగా పనికిరారని లేఖలు రాశారని కూడా అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామని హెచ్చరించిన చంద్రబాబు రామోజీరావుకి ముద్దుబిడ్డలా ఉన్నారని, ఈనాడు, రామోజీకి వాస్తవాలు కనిపించవా అని ప్రశ్నించారు.

చంద్రబాబు దత్తపుత్రుడు, కామ్రేడ్లకు సమ్మె కావాలని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5కి సమ్మె కావాలని.. వారు అదే కోరుకుంటన్నారని ఆరోపించిన జగన్… చర్చలు సఫలం కావడం, సంధి జరగడం వారికి ఇష్టం లేదని చెప్పారు. ఉద్యోగుల సమ్మె జరుగుతుంటే ఎల్లో మీడియాకు పండగ అని అన్నారు. అందుకే ఉద్యోగులు సమ్మె విరమించగానే కామ్రేడ్లను ముందుకు తోశారని మండిపడ్డారు. 

విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయుల సమ్మెలోకి వెళ్లొద్దని పరోక్షంగా సూచించారు సీఎం జగన్.