మంట‌లు రేపుతున్న మాట‌లు

రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీ ఏపీ విభ‌జ‌న‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర రాజ‌కీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణ స‌మాజాన్ని అవ‌మానించేలా ప్ర‌ధాని వ్యాఖ్య‌లున్నాయని ప్ర‌త్య‌ర్థులు ఎదురు దాడికి దిగారు. కాంగ్రెస్‌, తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యాఖ్య…

రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని మోదీ ఏపీ విభ‌జ‌న‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర రాజ‌కీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణ స‌మాజాన్ని అవ‌మానించేలా ప్ర‌ధాని వ్యాఖ్య‌లున్నాయని ప్ర‌త్య‌ర్థులు ఎదురు దాడికి దిగారు. కాంగ్రెస్‌, తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యాఖ్య ల‌ను నిర‌సిస్తూ ప్ర‌ధాని దిష్టిబొమ్మ‌ల‌ను త‌గ‌ల‌బెట్టాల‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్ప‌టికైనా కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఏర్ప‌డింద‌నే విష‌యాన్ని అంగీక‌రించినందుకు ధ‌న్య‌వాదాల‌ని పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల వ్యంగ్యంగా అన్నారు.

ఇదిలా వుండ‌గా అస‌లే మోదీపై ఆగ్ర‌హంగా ఉన్న టీఆర్ఎస్‌కు రాజ్య‌స‌భ‌లో తెలంగాణ ఏర్పాటు చేసిన వ్యాఖ్య‌లను ఆయుధంగా తీసుకుంది. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అవ‌మానించార‌ని మంత్రి హ‌రీష్‌రావు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. రాజ్య‌స‌భ‌లో ఎలాంటి చ‌ర్చ లేకుండా, అప్ర‌జాస్వామికంగా ఏపీని కాంగ్రెస్ విభ‌జించింద‌ని మోదీ విమ‌ర్శించ‌డంపై తెలంగాణ స‌మాజం మండిప‌డుతోంది. కాంగ్రెస్‌పై బాణాలు సంధించ‌డంలో గురి త‌ప్పింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోసారి టీఆర్ఎస్ చేతికి మోదీ తెలంగాణ విభ‌జ‌న అస్త్రాన్ని చేజేతులా అందించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలంగాణ‌పై మొద‌టి నుంచి బీజేపీకి ప్రేమ లేద‌ని మంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో వేలాది బ‌లిదానాల‌కు కాంగ్రెస్‌, బీజేపీ కార‌ణం కాదా అని ఆయ‌న నిల‌దీశారు. 2004లోనే తెలంగాణ ఇచ్చి వుంటే అంత మంది చ‌నిపోయేవారా అని మంత్రి నిల‌దీశారు.  

రాష్ట్రాల ఏర్పాటులో కాంగ్రెస్ అన్యాయం చేసింద‌నే ప్ర‌ధానిపై హ‌రీష్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏడైళ్లైనా విభ‌జ‌న హామీలు ఎందుకు నెర‌వేర్చ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ ఏర్పాటుపై మోదీ ప్ర‌సంగాన్ని విన్న త‌ర్వాతైనా రాష్ట్ర బీజేపీ నేత‌లు క‌ళ్లు తెర‌వాల‌ని మంత్రి కోరారు. తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకు అని మండిపడ్డారు. ఉత్తర భారతానికి ఒకనీతి, దక్షిణ భారతానికి ఒక నీతా? అని హ‌రీష్‌రావు విరుచుకుప‌డ్డారు.