ఉత్తరాంధ్రాకు చెందిన ప్రజాకవివంగపండు ప్రసాదరావు, ఎనిమిది పదుల జీవితం. అరవయ్యేళ్ళ సాహిత్య ప్రస్థానం. అయినా కూడా జీవిత పర్యంతం ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కానీ ఆయన అంత్య దశలో వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడమే కలసివచ్చింది.
అందుకే ఆ ప్రజాకవికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. ఈ మేరకు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ప్రజా కళా సంఘాలు హర్షిస్తున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా ప్రజాకళాకారుడిగా ఉన్నా కూడా దక్కని గౌరవం మరణాంతరం జగన్ సర్కార్ దక్కించిందనే త్రుప్తి ఆయన అభిమానులలో ఉంది.
ఇక వంగపండు విగ్రహాన్ని కూడా ఉత్తరాంధ్రాలోని విశాఖలో ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందని చెబుతున్నారు. వంగపండు కుమార్తె ఉషను ముఖ్యమంత్రి జగన్ ఫోన్ ద్వారా పలకరించి ఓదార్చారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఆయన హామీ ఇచ్చారు.
ఓ విధంగా ఇది మరుగున పడిన కళాకారులకు పెద్ద స్వాంతన. ఏళ్ళకు ఏళ్ళు కళా సేవలో ఉంటూ అన్నీ పోగొట్టుకున్న వారికి ఒక ఊరట. వంగపండు విషయంలో జగన్ సర్కార్ తీసుకున్న చర్యలను కళా సంఘాలు పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నాయి.