జగన్ అమరావతిని తరలించేస్తున్నారట. అమరావతి నిర్మాణం జగన్ కు ఇష్టంలేదట. అందుకే అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతున్నా ఇప్పటివరకు అమరావతి అంశాన్ని జగన్ చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. మొన్నటివరకు ప్రతిపక్షం ఆరుపులు ఈ విధంగా సాగాయి. ఇప్పుడు అందరి నోళ్లు మూయించే ప్రాసెస్ ప్రారంభమైంది. రాజధాని అంశంపై వివిధ దశల్లో సమీక్షలు నిర్వహించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు నిర్మాణానికి సంబంధించి ముందడుగు వేశారు. జగన్ తాజా నిర్ణయంతో అమరావతి తరలిపోతుందనే ప్రతిపక్షల గగ్గోలుకు ఫుల్ స్టాప్ పడినట్టయింది.
అయితే ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది. గతంలో చంద్రబాబు ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ను యథాతథంగా అమలుచేయడం లేదు సీఎం. దానికి కొన్ని మార్పుచేర్పులు చేశారు. సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ లో భారీ భవంతులు ఉన్నాయి. వాటి స్థానంలో చిన్న నిర్మాణాలు చేయబోతున్నారు. 25 అంతస్థుల నిర్మాణాల స్థానంలో 10 అంతస్తుల నిర్మాణాల్ని చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు.. రాజధాని భౌగోళిక స్వరూపం, ప్రజల జీవనస్థితిగతులు, ప్రస్తుత మార్కెట్ విలువను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.
అసలు ప్లాన్ లో 5 టవర్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి 2 టవర్లు మాత్రమే నిర్మించాలని నిర్ణయించారు. ఇలాంటి ఎన్నో మార్పుల్ని సీఆర్డీఏ ప్రతిపాదించింది. వాటన్నింటినీ ముఖ్యమంత్రి ఆమోదించారు. మొదటి దశలో 2 రెండు టవర్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. దీనికోసం 3వేల 132 కోట్ల రూపాయలు అంచనా వేశారు. ఆల్రెడీ వీటికి 332 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో 300 కోట్లు విడుదల చేయబోతున్నారు. మొత్తంగా 2023 నాటికి అన్ని నిధులు విడుదల చేసి, టవర్లు పూర్తిచేయాలని జగన్ ఆదేశించారు.
ఇలా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒకేసారి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి. ఇది చూసైనా చంద్రబాబు తన ఆరోపణలు మానుకుంటే బాగుంటుంది. సరిగ్గా కొన్ని రోజుల కింద రాజధాని నిర్మాణంపై టీడీపీ శ్రేణులు చేసిన ఆరోపణలు, పుట్టించిన పుకార్లను అంతా చూశాం. అప్పుడు ఈ అంశంపై జగన్ స్పందించలేదు. ఇప్పుడు తన స్పందనను చేతల్లో చూపించి, తను మాటల ముఖ్యమంత్రిని కాదని, చేతల ముఖ్యమంత్రినని నిరూపించుకున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో ప్రజలకు భ్రమరావతిని చూపిస్తే, జగన్ తన హయాంలో అసలైన అమరావతిని ప్రజలకు చూపించబోతున్నారు.