కరోనా ఎఫెక్ట్: పెద్ద మనసు చాటుకున్న జగన్

గతేడాది కరోనా వ్యాప్తి చెందిన టైమ్ లో జగన్ సర్కార్ ఎంత క్రియాశీలకంగా పనిచేసిందో అందరం చూశాం. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా అందరికీ నిత్యావసరాలు, బియ్యం అందించి ముఖ్యమంత్రి జగన్ తన సహృదయతను…

గతేడాది కరోనా వ్యాప్తి చెందిన టైమ్ లో జగన్ సర్కార్ ఎంత క్రియాశీలకంగా పనిచేసిందో అందరం చూశాం. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా అందరికీ నిత్యావసరాలు, బియ్యం అందించి ముఖ్యమంత్రి జగన్ తన సహృదయతను చాటుకున్నారు. చివరికి రేషన్ కార్డు లేని నిరుపేదలకు కూడా మానవతా దృక్పథంతో సాయం అందించారు. ఇప్పుడు మరోసారి జగన్ తన పెద్ద మనసు చాటుకున్నారు.

కరోనా వల్ల పేదలందరికీ 5 కిలోల బియ్యం ఇవ్వడానికి కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి జగన్ మరో 5 కిలోలు కలిపారు. మొత్తంగా ప్రతి పేద కుటుంబానికి 10 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది లానే ఈసారి కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా నిరుపేదలకు మానవతా దృక్పథంతో బియ్యం అందించాలని ఆదేశాలిచ్చారు.

కేంద్రం ఇచ్చే బియ్యంతో కేవలం 88 లక్షల మందికి మాత్రమే లబ్ది చేకూరుతుంది. జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏకంగా కోటి 47 లక్షల మందికి లబ్ది చేకూరుతుంది. కేవలం బియ్యంతోనే ఆగిపోకుండా.. రాబోయే రోజుల్లో ఇతర నిత్యావసరాలు అందించేందుకు కూడా ప్రణాళిక రచించాలని జగన్ ఆదేశించారు.

మరోవైపు కరోనా కట్టడికి ఏపీలో మరిన్ని అదనపు చర్యలకు ఆదేశించారు. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు జిమ్స్, స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్ మూసేయాలని నిర్ణయించారు. ఇక ప్రజా రవాణాలో 50శాతం మాత్రమే అనుమతించాలని, రెమిడెసివర్ పర్యవేక్షణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు జగన్.

కరోనా చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందుల్ని సమకూర్చాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు. 

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని సూచించిన ముఖ్యమంత్రి.. రెమిడెసివర్ లేదా ఆక్సిజన్ కొరత ఏర్పడితే వెంటనే హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదనే విషయం ప్రజలకు చేరేలా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు.