ఏపీలో గణనీయంగా తగ్గిన మద్యపానం

మద్యపాన నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇప్పటికే భారీగా ధరల్ని పెంచిన జగన్ సర్కార్.. ఇప్పుడు వైన్ షాపుల సంఖ్యను మరింత కుదిస్తూ ఆదేశాలు జారీచేసింది. గతంలోనే 22 శాతం…

మద్యపాన నిషేధం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇప్పటికే భారీగా ధరల్ని పెంచిన జగన్ సర్కార్.. ఇప్పుడు వైన్ షాపుల సంఖ్యను మరింత కుదిస్తూ ఆదేశాలు జారీచేసింది. గతంలోనే 22 శాతం వైన్ షాపుల్ని తొలిగించిన ప్రభుత్వం.. తాజాగా మరో 13 శాతం దుకాణాల్ని తగ్గించే దిశగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెలాఖరుకు రాష్ట్రంలో 33శాతం షాపులు తగ్గి.. 4380 నుంచి 2934కు దుకాణాలు తగ్గబోతున్నాయి.

ఎన్నికల ప్రచార హామీలో భాగంగా రాష్ట్రంలో మద్యపానాన్ని పూర్తిగా అరికడతానని జగన్ పదే పదే ప్రకటించారు. చెప్పినట్టుగానే రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం తగ్గుతున్నప్పటికీ వైన్ షాపుల్ని కుదించేందుకే మొగ్గుచూపారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 43 వేలకు పైగా ఉన్న బెల్ట్ షాపుల్ని మూసేసిన ముఖ్యమంత్రి.. బార్లన సగానికి సగం తగ్గించేశారు. ఇప్పుడు వైన్ షాపుల్ని కూడా మరింతగా తగ్గించబోతున్నారు.

మరోవైపు మద్యం ధరల పెంపుతో రాష్ట్రంలో మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 24 శాతం మద్యం అమ్మకాలు పడిపోయాయి. అటు బీర్ల అమ్మకాలైతే ఏకంగా 55శాతం పడిపోయాయి. దీనికి తోడు తాజాగా మద్యం ధరల్ని అమాంతం పెంచింది జగన్ సర్కార్. ముందు 25శాతం ధరలు పెంచిన ప్రభుత్వం, ఆ మరుసటి రోజుకే అమాంతం 50శాతం పెంచేసింది. దీంతో రాబోయే రోజుల్లో మద్యం అమ్మకాలు మరింత తగ్గుతాయని భావిస్తోంది సర్కార్.

మరోవైపు నాటుసారా, అక్రమ రవాణాను అరికట్టే బాధ్యతను పూర్తిగా ఎస్పీలకు అప్పగించారు జగన్. సరిహద్దుల నుంచి మద్యం ఎట్టిపరిస్థితుల్లో రాష్ట్రానికి రావడానికి వీల్లేదని.. అలాగే లోకల్ గా కూడా ఎవ్వరూ నాటుసారా తయారుచేయకుండా చూడాలని ఆదేశించారు.

మద్యం ధరల్ని అమాంతం పెంచినందుకు జగన్ సర్కార్ పై టీడీపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించింది. మద్యనిషేధం అంటూనే ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించింది. ఇప్పుడు వైన్ షాపులు కుదిస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడంతో.. టీడీపీ నోటికి తాళం పడింది.

అప్పటి నిజాలు బయటపెట్టిన కొడాలి నాని

చంద్రబాబుని అలా వదిలెయ్యకు తల్లీ