ఊహించని విధంగా బీసీల సదస్సుల్ని తెరపైకి తీసుకొచ్చింది వైసీపీ. ఇక్కడ ప్రభుత్వంతో సంబంధం లేదు, వైసీపీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఈ సదస్సుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని వెనక జగన్ భారీ స్కెచ్ కనిపిస్తోంది. కుల సమీకరణాలతో రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. బీసీల్ని తన వైపు తిప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో జగన్ కు తిరుగుండదు. అందుకే ఇలా బీసీల ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటుచేయాలని వైసీపీ భావిస్తున్నట్టుగా ఉంది.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పట్టం కట్టారు. 139 బీసీ కులాల్ని ఆదుకునేలా చర్యలు చేపట్టారు. బీసీల కోసం ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. వాటికి నామినేషన్ పదవులు కట్టబెట్టారు. ఊహించని విధంగా అందరికీ నామినేషన్ పదవులు దక్కాయి. పనుల్లో కూడా బీసీలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పనులన్నింటినీ బీసీలకు చెప్పడంతో పాటు, జగన్ వచ్చిన తర్వాతే బీసీలకు న్యాయం జరిగిందనే విషయాన్ని ఎన్నికల ముందు బలంగా చెప్పాలనుకుంటున్నారు. అందుకే ఈ ప్రయత్నాలు.
ప్రాంతీయ సమావేశాల తర్వాత రాష్ట్రస్థాయి సమావేశాలు..
బీసీల ప్రాంతీయ సమావేశాలు పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయి సమావేశాలు మొదలవుతాయి. ప్రస్తుతానికి బీసీల కుల సంఘాలకు నాయకులు ఉన్నా కూడా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ సంఘాల కార్పొరేషన్ చైర్మన్ లే ఆయా కులాలకు పెద్ద దిక్కుగా నిలిచారు. చేతి వృత్తుల వారి సమస్యలైనా, ఇతరత్రా ఆర్థిక సాయం విషయాల్లోనైనా నేరుగా మంత్రులకు వారు అనుసంధానకర్తలుగా ఉంటున్నారు. ఆయా సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించగలుగుతున్నారు.
ఈ దశలో దాదాపుగా బీసీ సంఘాల చైర్మన్లే ఈ సమావేశాలకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రాంతీయ స్థాయి సమావేశాల తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా బీసీ కులాలను సంఘటితం చేస్తారని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని బీసీ కులాలు బేషరతుగా వైసీపీకి మద్దతిస్తే మిగతా పార్టీల పని గల్లంతే. మిగతా పార్టీలన్నీ కలసినా కూడా బీసీల అండదండలున్న వైసీపీని ఏం చేయలేవు.
కాపు రిజర్వేషన్ల విషయంలో.. ఆ పని చేయలేనని ఎన్నికల సమయంలోనే కరాఖండిగా చెప్పిన జగన్ కు బీసీలంతా మద్దతు తెలిపారు. కాపులను బీసీల్లో చేర్చి, తమ నోటికాడ కూడు తీసేసేందుకు జగన్ ఇష్టపడలేదని, అందుకే ఆయనకు తామంతా మద్దతిచ్చామని చెబుతుంటారు బీసీలు. ఇక ఎన్నికల తర్వాత బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు కావడంతో బీసీ కులాలన్నీ జగన్ కు రుణపడి ఉంటామని చెబుతున్నాయి.
కాపు ఓట్లు జనసేన వైపే ఉంటాయనేది పూర్తిగా అవాస్తవం. కాపుల్లో కూడా పవన్ ని వ్యతిరేకించేవారు చాలామందే ఉన్నారు. కాపుల్లో జగన్ ని అభిమానించేవారు కూడా ఉన్నారు. పోనీ.. బీసీలు వైసీపీకి దగ్గరై, కాపు ఓట్లు దూరమైనా పెద్ద నష్టం ఉండదు. టీడీపీ-జనసేన-బీజేపీ మూడూ కూటమిగా ఏర్పడినా ఫలితం ఉండదు. బీసీ ఓట్లన్నీ గుంపగుత్తగా వైసీపీకి పడితే ప్రతిపక్షాలకు బ్యాండ్ బాజానే.