ఆర్ఆర్ఆర్ ఆల్రెడీ వచ్చేసింది, కేజీఎఫ్ పార్ట్2 రెడీగా ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏది గొప్ప అని నేరుగా కంపేర్ చేయలేం కానీ, రెండూ ఒకే సీజన్లో రావడం, రెండూ పాన్ ఇండియా మూవీస్ కావడం, రెండూ దక్షిణాది నుంచి రెడీ కావడం మాత్రం ఇంట్రస్టింగ్ అంశాలు. అందులోనూ నీల్ ఇప్పుడు తెలుగులో జెండా పాతడానికి రెడీగా ఉన్నాడు.
ప్రభాస్, ఎన్టీఆర్.. నీల్ కోసం లైన్లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ రికార్డుల్ని కేజీఎఫ్ -2 బీట్ చేయగలిగితే అది పక్కా అవుతుంది.
కలెక్షన్ల విషయానికొస్తే..
కేజీఎఫ్ పార్ట్-1.. ఇప్పటికే బాహుబలి-1 రికార్డుల్ని బీట్ చేసింది. కానీ బాహుబలి-2 దానికి అందలేదు. కేజీఎఫ్ పార్ట్-2 వచ్చినా కూడా బాహుబలి-2 కలెక్షన్ల రికార్డుల్ని బీట్ చేస్తుందని చెప్పలేం. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. కలెక్షన్ల విషయంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రేటు వచ్చేసింది. ఏపీలో ఆర్ఆర్ఆర్ కి 10 రోజులు బాగా గిట్టుబాటైంది. కేజీఎఫ్ కి ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. పైగా ఆర్ఆర్ఆర్ కి పోటీ లేదు. ఇక ఉత్తరాదిలో ఆర్ఆర్ఆర్ ఇంకా 100కోట్ల మార్కు చేరుకోలేదు. దీన్ని కేజీఎఫ్-2 బీట్ చేస్తే మాత్రం నార్త్ లో కూడా నీల్ దమ్మున్నోడు అనిపించుకుంటాడు.
కలెక్షన్లు పక్కనపెడితే.. ఫస్ట్ డే ఫస్ట్ టాక్ తోనే అంతా తేలిపోతుంది. ఆర్ఆర్ఆర్ అందరూ ఆహా ఓహో అన్నా.. బాహుబలి-2 కి వచ్చినంత క్రేజ్ మాత్రం రాలేదనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ ఇద్దరు టాప్ హీరోల సినిమా అయినప్పటికీ, ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదని చెప్పేవాళ్లే ఎక్కువ.
కేజీఎఫ్ అలా కాదు. హీరో ఒక్కడే. అందులోనూ పార్ట్-1 తో పోల్చి చూసే అవకాశాలు ఎక్కువ. ఏమాత్రం ఫ్లేవర్ మారినా ఈజీగా తొక్కేస్తారు. కేజీఎఫ్ పార్ట్ 1 పై వచ్చిన క్రేజ్ ని నీల్ నిలబెట్టుకున్నాడా లేదా అనేది ఫస్ట్ డే తోనే తేలిపోతుంది. అది నిలబెట్టుకుంటే ఆటోమేటిక్ గా రాజమౌళి సరసన నిలిచినట్టే, లేకపోతే నీల్ సింగిల్ పార్ట్ వండర్ గా మిగిలిపోతాడు, రాజమౌళి ఎవర్ గ్రీన్ అవుతాడు.
రాజమౌళికి ఆయన ఫ్యామిలీ పెద్ద అసెట్. తండ్రి విజయేంద్ర ప్రసాద్, సోదరుడు కీరవాణి, మరీ ముఖ్యంగా తనయుడు కార్తికేయ.. ఇలా అన్ని రంగాల నుంచి రాజమౌళికి అద్భుతమైన ప్యాడింగ్ ఉంది. వీరందర్నీ పక్కనపెట్టి రాజమౌళి మరో టీమ్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందనేది ఊహించడం కూడా కష్టం. ఇలాంటి ఘనమైన సపోర్ట్ నీల్ కు లేదు. కేజీఎఫ్ తో అతడో టీమ్ ను సెట్ చేసుకున్నాడు. పార్ట్-1తో మేజిక్ చేశాడు. పార్ట్-2తో ఆ మేజిక్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి.
మొత్తమ్మీద కేజీఎఫ్ పార్ట్-2 అనేది చాలా ప్రశ్నలకు సమాధానంగా మిగులుతుంది. రాజమౌళి సరసన చేరే సరైనోడు వచ్చాడా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.