హత్య జరిగిందనేది వాస్తవం. కానీ ఎందుకు జరిగింది.. ఎక్కడ జరిగింది.. మృతదేహం ఎక్కడ.. ఈ విషయాల్ని మాత్రం పోలీసులు కనిబెట్టలేకపోయారు. సాంకేతిక పరిజ్ఞానం కూడా వాళ్లకు కలిసిరాలేదు. అలా ఏడాదిగా ముప్పుతిప్పలు పెట్టిన కేసును చిత్తూరు జిల్లా పోలీసులు ఛేదించారు. అయినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. స్థానికంగా కలకలం రేపిన ఆ కేసు వివరాలు ఇలా ఉన్నాయి
చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన నరేష్, ఇస్మాయిల్ స్నేహితులు. ఏ పని చేసినా కలిసి చేస్తారు. రోజూ కనీసం రెండుసార్లయినా కలుసుకుంటారు. ఉన్నట్టుండి ఇస్మాయిల్ మాయమయ్యాడు. 3 రోజులుగా ఎవ్వరికీ కనిపించలేదు. తనకేం తెలియదని నరేష్ బుకాయించాడు. పోలీసులు అరెస్ట్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించినప్పటికీ నరేష్ బయటపడలేదు. అతడ్ని లాక్ చేయడానికి పోలీసుల దగ్గర ఆధారాలు కూడా లేవు.
అలా అంతుచిక్కకుండా ఉండిపోయిన ఈ కేసు కొలిక్కి వచ్చింది. వివాహేతర సంబంధమే కారణమని తేలింది. అక్రమ సంబంధం ఈ ఇద్దరు స్నేహితుల మధ్య చిచ్చుపెట్టింది. దీంతో బాగా తాగిన మత్తులో ఉన్న నరేష్, ఇస్మాయిల్ కొట్టుకున్నారు. ఆ ఘర్షణలో ఇస్మాయిల్ తల పగలగొట్టాడు నరేష్. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు ఇస్మాయిల్.
చనిపోయిన ఇస్మాయిల్ ను సమీపంలో ఉన్న ఓ పల్లపు ప్రాంతంలో పాతిపెట్టాడు నరేష్. ఎలాంటి ఆధారాలు లేకుండా చేశాడు. దీంతో ఈ కేసును ఛేదించడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ వివరాలన్నింటినీ ఏడాది గడిచిన తర్వాత తాజాగా నిన్న బయటపెట్టాడు నరేష్. నేరాన్ని అంగీకరించాడు.
అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. నరేష్ చెప్పిన చోటుకు వెళ్లి చూసిన పోలీసులు అవాక్కయ్యాయి. పల్లం కావడంతో ఇప్పుడా ప్రదేశం చిన్న చెరువుగా మారింది. అప్పటికీ కొంతమంది ఈతగాళ్లను చెరువులోకి పంపించి వెదికించే ప్రయత్నం చేసినప్పటికీ వీలుపడలేదు. నీరు మొత్తం తోడించి, డెడ్ బాడీని బయటకు తీయబోతున్నారు. అలా ఏడాదిగా స్థానికంగా కలకలం రేపిన ఈ కేసు కొలిక్కి వచ్చింది.