ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి ఆ దిశగా వడివడిగా అడుగులు వేగంగా వేస్తున్నారు.
ఇందులో భాగంగా విశాఖ మీద పూర్తి ఫోకస్ పెడుతున్నారు. విశాఖలో యంగ్ టీమ్ తో కూడిన ఐఏఎస్ అధికారులను సెలెక్ట్ చేసుకుంటున్నారు. రానున్న రోజులలో వీరి అవసరం చాలా ఎక్కువగా ఉంటుందన్న అంచనాల మేరకే జగన్ ఈ డెసిషన్ తీసుకుంటున్నారు అంటున్నారు.
విశాఖకు అతి త్వరలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ రానున్న నేపధ్యంలో విశాఖలోని కీలక అధికారిక స్థానాలలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. విశాఖ జిల్లా కలెక్టర్ గా గంధం చంద్రుడిని నియమిస్తారు అని టాక్ నడుస్తోంది.
ఆయన అత్యంత వెనకబడిన అనంతపురం జిల్లా కలెక్టర్ గా విశేష సేవలు అందించి వచ్చారు. దాంతో ఈ యువ ఐఏఏస్ అధికారి ఇకపై ప్రతిపాదిత రాజధాని విశాఖ అభివృద్ధి కోసం సమర్ధవంతమైన సేవలు అందించబోతారు అని తెలుస్తోంది.
అలాగే ప్రస్తుత జిల్లా కలెక్టర్ వినయ చంద్ కి విశాఖలో అణువణువూ తెలుసు. ఆయన పనితీరు కూడా ప్రభుత్వ పెద్దలకు నచ్చింది. దాంతో ఆయనకు ఏకంగా సీఎంఓ ఆఫీస్ లోనే కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.
మరో వైపు జిల్లాలోని ఐఏఎస్ అధికారులకు కూడా స్థాన చలనం ఉంటుందని తెలుస్తోంది. అలాగే జీవీఎంసీ కమిషనర్ కూడా కొత్త వారు వస్తారని అంటున్నారు.
మొత్తానికి జగన్ విశాఖ రాకముందే తనదైన టీమ్ ని సెట్ చేసుకుంటున్నారు అని చెబుతున్నారు.