మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. వైఎస్సార్ రైతు భరోసా అమలు కాబోతోంది. కేవలం భూ యజమానులకే కాదు, కౌలు రైతులకు కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్లలోనే ఆర్థికసాయం డిపాజిట్ కానుంది. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ తీసుకోని నిర్ణయం ఇది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం, అతడ్ని చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయేలా చేస్తుంది.
ఇప్పటివరకూ ప్రభుత్వ పథకాలన్నీ పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులకి మాత్రమే వర్తించేవి. ఊరిలో పొలాలు కౌలుకిచ్చి, ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకునే భూస్వాములు కూడా గతంలో ప్రభుత్వ లబ్ధిపొందేవారు. పొలంలో కాయకష్టం చిందించే బక్కరైతు మాత్రం పెట్టుబడికి నిధులు లేక, అధిక వడ్డీకి అప్పులు తీసుకొచ్చి కుదేలయ్యేవాడు. అప్పుల బాధ పెరిగితే ఆత్మహత్యలే శరణ్యం. కానీ ఇప్పుడా పరిస్థితి మారుతోంది. కౌలు రైతుని కూడా పూర్తిస్థాయిలో రైతుగా గుర్తించి జగన్ ప్రభుత్వం రైతు భరోసాకి అర్హులను చేసింది.
కౌలురైతు కార్డులిస్తూ వాటిపై బ్యాంకు రుణాలు తీసుకునేందుకు అవకాశమిచ్చింది. అంటే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కౌలు రైతులు ప్రభుత్వ సాయం అందుకోబోతున్నారన్నమాట. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏటా 12,500 రూపాయలు సాయమందిస్తామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా రైతులకు 6 వేల రూపాయలు ఆర్థికసాయం చేస్తోంది. ఈ ఆర్థిక సాయం మినహాయించి మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తుంది.
ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. అయితే సీఎం జగన్ ఎక్కడా ఏ రైతుకీ అన్యాయం చేయడంలేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం కౌలు రైతుల్ని లెక్కలోకి తీసుకోలేదు. కేవలం భూ యజమానులకు మాత్రమే 6వేల ఆర్థికసాయం చేస్తోంది. అంటే కేంద్రం ద్వారా కౌలు రైతులు పొందేలబ్ధి సున్నా. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తోంది. వీరికి పూర్తి మొత్తం 12,500 రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది. భూ యజమానులకి మాత్రం సాయాన్ని 6,500 రూపాయలకు పరిమితం చేసింది.
అంటే జగన్ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ప్రతి రైతూ 12,500 ఆర్థిక సాయాన్ని అందుకోబోతున్నాడు. ఈనెల 15న నెల్లూరు జిల్లా నుంచి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ రైతు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాల మేనిఫెస్టోలో ఇది కూడా ఒకటి.