తెలంగాణ రాష్ట్రం 'బంగారు తెలంగాణ'గా కాదు, బలిదానాల తెలంగాణగా మారిపోయింది. బంగారు తెలంగాణ అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఊతపదం. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడినప్పటినుంచి 'బంగారు తెలంగాణ చేస్తా' అంటూ ఊదరగొడుతున్నారు. ఈయనకు తానాతందానా అంటూ భజన చేసే నాయకులు, మంత్రులు, ఫిరాయింపుదారులు… అందరూ బంగారు తెలంగాణ అంటూ నిరంతరం స్మరణ చేస్తూనే ఉన్నారు. కాని కాలక్రమంగా బంగారు తెలంగాణ కావడమేమోగాని బలిదానాల తెలంగాణగా మిగిలిపోతోంది. నిజంగా ఇది చాలా విషాదకరం. ఆందోళనకరం. తెలంగాణ ఉద్యమంలో మొదలైన బలిదానాలు ఇప్పటికీ కొనసాగుతుండటం తెలంగాణ దురదృష్టం. తెలంగాణకు గొప్ప పోరాట చరిత్ర ఉంది. రజాకార్ల వ్యతిరేక ఉద్యమం నుంచి రెండు దశలుగా జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఇక్కడి ప్రజల పోరాట పటిమను చూశాం.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచంలో జరిగిన గొప్ప పోరాటాల్లో ఒకటి. నైజాము రాజుకు గోరీ కడతామని గర్జించిన తెలంగాణ ఇప్పుడెందుకు ఆత్మబలిదానాలకు బలైపోతోంది? బలిదానాలు లేకుండా ఈ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావా? బలవంతంగా ప్రాణాలు తీసుకుంటేనే పాలకులు దిగొస్తారా? 1969-70 ప్రాంతాల్లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో సుమారు నాలుగొందలమంది చనిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత చెలరేగిన మలిదశ ఉద్యమంలోనూ చాలామంది చనిపోయారు. తొలిదశ ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోగా, రెండోదశ ఉద్యమంలో చాలామంది యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలనే బలిదానాలు అంటున్నాం. ప్రత్యేక తెలంగాణ రాదేమోననే అనుమానంతో, మనస్తాపంతో అనేకమంది అనవసరంగా విలువైన ప్రాణాలు వదులుకున్నారు. ఇందుకు శ్రీకాంతాచారి బలిదానం శ్రీకారం చుట్టింది. ఆ తరువాత ఒక ఉన్మాదంలా చాలామంది ప్రాణాలు తీసుకున్నారు.
ఆ సమయంలో ప్రత్యేక తెలంగాణ సాధనకోసం పోరాడుతున్న ఉద్యమకారులు వ్యక్తిగత సమస్యలతో సంభవించిన ఆత్మహత్యలను కూడా బలిదానాలుగా చిత్రీకరించారనే విమర్శలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రసాధన కోసం ఎంతమంది బలిదానం చేశారనేది వివాదాస్పదంగా మారింది. రకరకాల లెక్కలు తెరమీదికి వచ్చాయి. కేసీఆర్ సర్కారు అమరుల కుటుంబాలకు అన్యాయం చేసిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అమరులకు సంబంధించి ఇప్పటికీ వాదవివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా కేసీఆర్ పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. కొంతకాలం కిందట ఇంటర్మీడియట్ బోర్డు చేసిన పాపాల కారణంగా అనేకమంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఇది రాష్ట్రంలో పెనుసంచలనం కలిగించింది. అయినా సర్కారు చలించలేదు. గొడవ చేసి చేసి తల్లిదండ్రులే గమ్మున ఉండిపోయారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల కుటుంబాలను సైతం అధికారపక్షం వారు పలకరించలేదు, పరామర్శించలేదు. తాజాగా ఆర్‌టీసీ కార్మికుల పోరాటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ఇది ఎటు దారి తీస్తుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ కార్మకుల ఉద్యమంలోనూ బలిదానాలు మొదలయ్యాయి. ఇద్దరు కార్మికులు ప్రాణాలు తీసుకున్నారు. మరో ఇద్దరు ముగ్గురు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి తోటి కార్మికులు అడ్డుకోవడంతో బతికిపోయారు. ఖమ్మంలో ప్రాణాలు తీసుకున్న డ్రైవరు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెప్పించింది. 'నా మరణంతోనైనా తెలంగాణ రావాలి'…అంటూ అప్పట్లో కొందరు సూసైడ్ నోట్ రాసిపెట్టి ప్రాణాలు వదిలారు. అదే తరహాలో ఖమ్మం డ్రైవరు కూడా 'నేను చనిపోయినా 48 వేల మంది కార్మికులు బాగుండాలె' అని నినదిస్తూ ప్రాణాలు తీసుకున్నాడు. ఇది నిజంగా బలిదానమే.
ఈయన మరణం తరువాత మరో కార్మికుడు ఉరేసుకొని చనిపోయాడు. ఇతన తన జీవితం ఏమైపోతుందోననే భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. కారణాలు ఏవైనా ప్రాణాలు తీసుకోవడం అత్యంత విషాదకరం. సీఎం కేసీఆర్ కఠిన వైఖరి కార్మికుల్లో భయం కలిగిస్తోంది. 'మీ ఉద్యోగాలు పోయాయి'…'మీకు మీరే సెల్ఫ్ డిస్మిస్ అయిపోయారు'…అంటూ కేసీఆర్ చేసిన బాధ్యతారహిత ప్రకటనలు బలహీన మసస్కులైన కొందరు ఆర్టీసీ కార్మికులను భయంలోకి, ఆందోళనలోకి నెట్టాయి. కేసీఆర్ ఆర్‌టీసీ కార్మికుల సమ్మెను కురుక్షేత్ర యుద్ధంలా మార్చారు. తన 'దొరతనం' తడాఖా చూపిస్తున్నారు. కార్మికులు పోరాటం చేయాలే తప్ప ప్రాణాలు తీసుకోవడంవల్ల ఏం ప్రయోజనం. వారి కుటుంబాలు అన్యాయమైపోతాయి.