ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో చిరంజీవి భేటీ. నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వ్యవహారం ఇది. ఓసారి కన్ఫామ్ అయి, మరోసారి వాయిదా పడి.. చివరకు ఈరోజు మహూర్తం కుదిరింది. ఈ భేటీ కేవలం సైరా నరసింహా రెడ్డి సినిమా చుట్టూనే తిరుగుతుందని సమాచారం. అయితే సినిమా విడుదలై చాలా రోజులైంది. ఇప్పుడు సైరా కోసం జగన్ ను కలవడంలో ఆంతర్యం ఏమిటో చిరంజీవికే తెలియాలి.
ఇప్పటికే ఈ సినిమా విషయంలో తెలంగాణ గవర్నర్ తమిళ సై ని కలసిన చిరంజీవి, ఆమెతో సినిమా బాగుందని చెప్పించుకున్నారు. అలా కాస్తో కూస్తో సినిమాకి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు జగన్ ని కలిసేది కూడా అందుకే అంటున్నారు. సీఎం జగన్ సినిమా చూసి బాగుందని కితాబిస్తే.. దాన్ని ప్రచారం చేసుకోవాలనేది చిత్ర యూనిట్ ఆలోచన. అంతా బాగానే ఉంది కానీ.. సైరా విడుదలై, కలెక్షన్లు కూడా నెమ్మదించిన టైమ్ లో ఇప్పుడీ భేటీ అవసరమేంటో అర్థం కావడంలేదు.
చిరంజీవి, జగన్ భేటీ కేవలం సైరా నరసింహారెడ్డి సినిమా కోసమే అయితే.. మరీ ఇంత లేట్ గా సీఎం ని కలసి చిరంజీవి తన సినిమాకి ఏమాత్రం క్రేజ్ తీసుకొస్తారనేది ఇప్పుడు అసలు సమస్య. ఈ భేటీ ఇంకాస్త ముందు జరిగి ఉంటే సినిమాకి కాస్తో కూస్తో ఉపయోగం ఉండేది. అయితే జగన్ అపాయింట్ మెంట్ చిరంజీవికి లేటైంది. జగన్ అపాయింట్ మెంట్ కుదరకపోవడం యాదృచ్ఛికమా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది పక్కనపెడితే నష్టం మాత్రం చిరంజీవికే జరిగిందనేది స్పష్టం.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిని కలవకపోయినా, కేసీఆర్ పరోక్షంగా చిరంజీవి నెత్తిన పాలు పోశారు. తెలంగాణలో దసరా సెలవల్ని వారం రోజులు పొడిగించడంతో అక్కడ సినిమా కలెక్షన్లు మరీ వీక్ అయ్యే ప్రమాదం తప్పిపోయింది. కొత్త సినిమాలు వస్తున్నా.. మరో వారం రోజుల పాటు సైరాకి ఇబ్బంది ఉండదనేది ట్రేడ్ వర్గాల మాట. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం. ఇలాంటి టైమ్ లో జగన్ తో భేటీ చిరుకు ఎంతమేరకు కలిసొస్తుందనేది ఆసక్తికరం.