జగన్ ప్రభుత్వ చర్యల పుణ్యమా అని ఉద్యోగ సంఘాల నాయకులు తమ మధ్య విభేదాలను సైతం పక్కన పెట్టి ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. తమలో విభేదాలను అవకాశంగా తీసుకుని, ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీసేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే చేదు నిజాన్ని నాయకులు గ్రహించారు. దీంతో తమలో తాము తర్వాతైనా గొడవ పడొచ్చని, ముందుగా తమను ఎన్నుకున్న, నమ్ముకున్న ఉద్యోగుల మనసులను బాధపెట్టే ప్రభుత్వ నిర్ణయాలపై పోరుబాట పట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు ఏకం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పీఆర్సీ, హెచ్ఆర్ఏ, ఇతరత్రా సమస్యలపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి అన్ని యూనియన్లు ముక్త కంఠంతో కలెక్టరేట్లను ముట్టడించి తమ సత్తా ఏంటో చాటి చెప్పారు. మున్ముందు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు కూడా కలిసి ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పరిణామాల్ని ప్రభుత్వం అసలు ఊహించలేదు. ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఒక వర్గంగా ఉంటూ ఇంత కాలం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుండడాన్ని చూశాం. వీరు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యోగ నాయకులుగా గుర్తింపు పొందారు.
ఇదే తరుణంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జేఏసీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వానికి అనుకూల నాయకులుగా గుర్తింపు పొందారు. ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవాలనే ధోరణితో వీరు వ్యవహరిస్తూ వస్తున్నారనేది తెలిసిందే.
అయితే ఉద్యోగుల ప్రయోజనాలకు పూర్తిగా విఘాతం కలిగించేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే అభిప్రాయం ఉద్యోగుల్లో బలంగా నాటుకెళ్ల డంతో ఇక చేయగలిగిందేమీ లేదనే ఉద్దేశంతో వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ కూడా …జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా వెంకట్రామిరెడ్డిది సీఎం జగన్ జిల్లానే. ప్రాంతీయ, వ్యక్తిగత, కులాభిమానాలను పక్కన పెట్టి… అంతకంటే తమకు ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యమని ఉద్యమ పిలుపు ఇవ్వడం విశేషం.
అంతేకాదు, ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ నాయకులతో ఇంత కాలం వెంకట్రామిరెడ్డికి విభేదాలున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటిని కూడా పక్కన పట్టి, అందరూ కలిసి ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ రచించేందుకు కలిసి మాట్లాడుకోవడం ఉద్యోగుల కోణంలో శుభపరిణామంగా చెప్పొచ్చు. మెరుగైన పీఆర్‌సీ సాధన కోసం ఏకతాటిపైకి వచ్చి ఉద్యమం చేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు నాయకులు తెలిపారు. ఉమ్మడి ఉద్యమానికి విధి విధానాల కోసం ఇవాళ సచివాలయంలో మరొక సారి నాలుగు జేఏసీల ముఖ్య నాయకత్వాలన్నీ కూర్చుని కీలక నిర్ణయాలు తీసుకుంటాయని వారు తెలిపారు.
విడివిడిగా ఆందోళనలు కాకుండా… వ్యక్తిగత విభేదాలు, ఆధిపత్య ధోరణులను పక్కన పెట్టి ఉమ్మడి కార్యాచరణ తీసుకోవాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చామని నాలుగు సంఘాల నాయకులు వెల్లడించడం గమనార్హం. ఈ నాలుగు సంఘాల నాయకులను ఏకం చేసిన ఘనత మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే దక్కుతుంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే…చివరికి శత్రువులను కూడా ఏకం చేసిందని ఉద్యోగులు అంటున్నారు.