నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ దారి తీసిన పరిస్థితులేంటో అందరికీ తెలుసు. ఏపీ సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి రాజద్రోహం కింద కేసు పెట్టారు. రఘురామకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందే తప్ప, కేసు విషయంలో జోక్యం చేసుకో లేదు.
అలాగే తనపై ఐదుగురు ముసుగులు కప్పుకుని మార్చిమార్చి కొట్టారని రఘురామకృష్ణంరాజు న్యాయస్థానానికి చేసిన ఫిర్యాదుపై సీరియస్ అయ్యింది. చివరికి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సికింద్రాబాద్ సైనికాస్పత్రి నివేదిక అనంతరం రఘురామ గాయాలపై చర్చ రాలేదు. ఇక ఏపీ సీఐడీ పోలీసులపై చర్యల సంగతి సరేసరి.
అయితే రఘురామకృష్ణంరాజును చితక్కొట్టారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పదేపదే టీడీపీ , ఆ పార్టీ అనుకూల మీడియా చెబుతోంది. సర్వోన్నత న్యాయస్థానం పెద్దగా దానిపై దృష్టి పెట్టకపోయినా, ఓ పథకం ప్రకారం రఘురామ గాయాల గురించి టీడీపీ నేతలు మాట్లాడ్డం ఆశ్చర్యం కలిగిస్తోంది. బెయిల్ కోసమే రఘురామ గాయాల నాటకం ఆడారని అధికార పార్టీ ప్రత్యర్థుల ఆరోపణలను తిప్పి కొడుతోంది.
రఘురామకృష్ణంరాజు గాయాలకు సంబంధించి మిల్టరీ ఆస్పత్రి మెడికల్ రిపోర్ట్‌తో స్పష్టత వస్తుందని అందరూ భావించారు. కానీ ఎంపీ కాలి గాయాలపై మిల్టరీ ఆస్పత్రి కూడా స్పష్టత ఇవ్వలేకపోయింది. దీంతో సుప్రీంకోర్టు కూడా అందుకు తగ్గట్టుగానే ఉభయులకు మధ్యస్తంగా ఆదేశాలు ఇచ్చింది.
దీంతో రఘురామను ఏపీ సీఐడీ పోలీసులు కొట్టారా? లేదా? అనే విషయమై చర్చ కొనసాగుతోంది. సీఐడీ పోలీసులు కొట్టారో లేదో తెలియదు కానీ, ఆ సాకుతో టీడీపీ , ఆ పార్టీ అనుకూల మీడియా మాత్రం రఘురామను రోజూ చావగొడుతోంది. ఈ బాదుడు కనిపించని గాయాలు చేస్తోంది. ఎంపీపై థర్డ్ డిగ్రీకి పాల్పడితే, ఇక సామాన్యుల సంగతేంటని చంద్రబాబు పదేపదే ప్రశ్నిస్తున్నారు. తాజాగా టీడీపీ నిర్వహించిన మాక్ అసెంబ్లీ సమావేశంలో కూడా రఘురామ గాయాల ప్రస్తావన వచ్చింది.
“పోలీసుల కస్టడీలో ఉన్న సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ముసుగేసి , రౌడీల్ని పిలిపించి కొట్టించారు. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు డాక్టర్లతో తప్పుడు రిపోర్టు ఇప్పించారు” అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీ ఆశాకిరణం నారా లోకేశ్ మరికాస్త ముందుకెళ్లి సంచలన ఆరోపణలు చేశారు.
“మిమ్మల్ని వ్యతిరేకిస్తే సొంత పార్టీ ఎంపీనే కొడతారా? ఆయన్ను కొట్టడాన్ని సీఎం లైవ్‌లో చూశారంటున్నారు” అని లోకేశ్ వ్యాఖ్యానించారు. లోకేశ్ ఏమి ఆశించి ఈ ఆరోపణలు చేశారో తెలియదు కానీ, చివరికి పరువు పోయేది మాత్రం రఘురామకృష్ణం రాజుకే. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపై వాడిన పరుష పదజాలానికి ఆ మాత్రం శాస్తి జరగాల్సిందే అనే వాళ్లే ఎక్కువ.
మొత్తానికి రఘురామకు సంబంధించి నారా లోకేశ్ అందిస్తున్న తాజా అప్‌డేట్ …లైవ్‌లో జగన్ చూస్తూ ఆనందపారవశ్యానికి లోనుకావడం. ఇటు అధికార పార్టీ వైసీపీ, అటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రఘురామను కేంద్రంగా చేసుకుని ఓ ఆట ఆడుకుంటున్నాయి. మధ్యలో మానసిక వేదన అనుభవిస్తున్నది మాత్రం రఘురామనే.