మంత్రుల రాజీనామాలతో పాటు మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి విజయం కోసం ఏం చేయాలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై వైసీపీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ముందే చెప్పినట్టు కేబినెట్ మార్పుపై మనసులో మాటను బయట పెట్టారు.
మంత్రులందరూ ఈ నెల 27న రాజీనామాలు చేయాలని ఆదేశించారు. సామాజిక సమీకరణల రీత్యా ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులంతా రాజీనామాలు చేసి సహకరించాలని కోరారు.
బహుశా ఉగాది నుంచి కొత్త కేబినెట్‌ను చూసే అవకాశాలున్నాయన్నారు. ఇక మీదట ప్రతి ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో తిరగాలని సూచించారు. సర్వేలో ఎమ్మెల్యే, ఎంపీలపై వచ్చే నివేదికల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టత ఇచ్చారు.
నెగెటివ్ రిపోర్ట్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇచ్చే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారని సమాచారం. పార్టీని బలోపేతం చేసేందుకు బూత్‌కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. 50 శాతం మహిళలకు పార్టీ పదవులుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఎమ్మెల్యే సచివాలయాలకు వెళుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. మూడేళ్లలో సంక్షేమ పథకాలు అద్భుతంగా ప్రజలకు దక్కాయని, ప్రభుత్వంపై సానుకూలత ఉందని జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పార్టీని ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం తనకుందని జగన్ చెప్పారు. మన పాలనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలైన తీరును ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని జగన్ సూచించారు.
పార్టీ, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా నిత్యం దుష్ప్రచారానికి తెగబడుతున్నాయన్నారు. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మరోసారి విజయం సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ప్రజాప్రతినిధులకు జగన్ దిశానిర్దేశం చేశారు.