కర్ణాటకలో ముస్లిం విద్యార్థిణులకు హైకోర్టు ధర్మాసనం ఊరటను ఇవ్వలేదు. వారు కోరినట్టుగా హిజాబ్ ను స్వతంత్రంగా గుర్తించలేదు. విద్యాలయాల్లోకి హిజాబ్ ను నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం సమర్థించింది.
హిజాబ్ ధారణను తప్పనిసరిగా అనుసరించాల్సిన, సున్నితమైన మత నిర్ణయంగా హైకోర్టు ధర్మాసనం పరిగణించలేదు. ఆ మేరకు తీర్పును ఇచ్చింది.
మరి ఈ అంశం ఇక సుప్రీంను చేరడం లాంఛనమే. వాస్తవానికి కర్ణాటక హైకోర్టులో విచారణకు ముందే కొంతమంది ఈ అంశంపై సుప్రీంను ఆశ్రయించారు. అయితే అప్పుడు ఈ పిటిషన్ ను విచారించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ఏం చెబుతుందో వేచి చూడాలని సుప్రీం కోర్టు పిటిషనర్లకు సూచించింది.
ఇప్పుడు కర్ణాటక హైకోర్టు తీర్పు ఏకంగా ధర్మాసనం ద్వారానే వెల్లడి అయ్యింది. ఇలాంటి నేపథ్యంలో… ఇక హిజాబ్ కోసం పోరాడుతున్న వారు సుప్రీం ను ఆశ్రయించడమే తరువాయి.
ఇలాంటి అంశాల్లో రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీం కోర్టుల నుంచి వైరుధ్యమైన తీర్పులు వచ్చిన దాఖలాలు లేకపోలేదు. ఈ అంశంలో సర్వోన్నత న్యాయస్థానం ఏం చెబుతుందో!