కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టమంటే.. వద్దంటావు, ఆ విషయంలో వైరాగ్యాన్ని ప్రదర్శిస్తావు! మరి ఏ అధికారంతో పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీని అనౌన్స్ చేశావు? అంటూ.. రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించాడు, ఆ పార్టీ సీనియర్ నేత, దేశంలోనే ప్రముఖ లాయర్ అయిన కపిల్ సిబల్.
కాంగ్రెస్ పార్టీని సోనియా, రాహుల్ లు భ్రష్టు పట్టిస్తున్న వైనంపై బాగా అసహనంతో ఉన్న ముఖ్య నేతల్లో కపిల్ సిబల్ ముందు వరసలో ఉన్నారు. తమ కుటుంబ ఆస్తిలా గాంధీలు కాంగ్రెస్ ను సర్వనాశనం చేస్తున్న వైనంపై ఆయన బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
సోనియా, రాహుల్ ను విమర్శించడం అంటే బీజేపీ వైపుకు వెళ్లిపోవడానికి రోడ్డు వేసుకోవడం కాదు. ఇది వరకూ బోలెడంత మంది కాంగ్రెస్ నేతలు ఈ పని చేశారు. అయితే దేశంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పక్షంగా కాంగ్రెస్ పార్టీ స్థానం గురించి కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలోపేతంగా ఉండటం కూడా ప్రజలకు మంచిది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, సుదీర్ఘ చరిత్రా, ఇప్పటికీ స్పష్టమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీ కళ్ల ముందే దుంపనాశనం అవుతుండటాన్ని కపిల్ సిబల్ లాంటి వారు ఆక్షేపిస్తున్నారు.
గాంధీ కుటుంబీకుల కంబంధ హస్తాల నుంచి కాంగ్రెస్ పార్టీ బయటపడాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ విషయంలో సూటిగా మాటల దాడిని కూడా కపిల్ మొదలుపెట్టారు. మరి కపిల్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా గాంధీల కుటుంబ బానిసల నుంచి ప్రకటన రావడమే తరువాయేమో!