జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన పాత మిత్రుడు సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వాలంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడాన్ని కూడా రామకృష్ణ తప్పు పట్టారు.
ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీ డైరెక్షన్లో పని చేస్తూ ఉన్నారని, అమిత్ షా డైరెక్షన్ లో రాష్ట్ర ఆస్తులను ఆదానికి చెందేలా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని రామకృష్ణ అన్నారు.
అలాంటి జగన్ ను దించడానికి పవన్ కల్యాణ్ మళ్లీ బీజేపీ నేతలను రోడ్ మ్యాప్ అడగడం ఏమిటి? అని అంటున్నారు రామకృష్ణ. గతంలో బీజేపీని పవన్ కల్యాణ్ విమర్శించడాన్ని కూడా రామకృష్ణ ప్రస్తావించారు.
విభజన తర్వాత రాష్ట్రానికి బీజేపీ పాచిపోయిన లడ్డూలను ఇచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారని రామకృష్ణ గుర్తు చేశారు. అప్పుడు పాచిపోయిన లడ్డూలు అన్న పవన్ కల్యాణ్ కు ఇప్పుడు వాటి రుచి మారిందా? అంటూ ఈ కమ్యూనిస్టు పార్టీ నేత ఎద్దేవా చేశారు.
గతంలో పవన్ కల్యాణ్ తో బాగా రాసుకుపూసుకు తిరిగిన వారిలో సీపీఐ రామకృష్ణ ముందున్నారు. కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలోకి దిగిన గత ఎన్నికల సమయంలో.. రామకృష్ణ పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు.
అన్న అడుగేస్తే మాస్.. అన్నట్టుగా పవన్ కల్యాణ్ గురించి అప్పట్లో గప్ఫాలు కొట్టడంతో కూడా రామకృష్ణ ప్రత్యేక ప్రావీణ్యాన్ని కనబరిచాడు. మరి అలాంటి రామకృష్ణకు కూడా ఇప్పుడు పవన్ పోకడ నచ్చడం లేదు పాపం!