నిర్మాణ రంగంలో నెంబర్ వన్ గా వున్న మై హొమ్ సంస్థ మీడియా, వినోద మాధ్యమాల్లోకి ఇప్పటికే అడుగు పెట్టింది. టీవీ 9, ఆహా వంటి సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెడుతోంది.
ముందుగా కొన్ని బడా నిర్మాణ సంస్థల్లో భాగస్వామిగా అడుగు పెడుతోంది. అంటే ఫండింగ్ చేసి, వాటా తీసుకుంటారు. బ్యానర్, పేరు ప్రస్తుతానికి ఇంకా డిసైడ్ చేయలేదు కనుక, ప్రెజెంట్ అన్నది వుండదు. త్వరలో బ్యానర్ ఫిక్స్ అయ్యాక అది కూడా జరుగుతుంది.
ప్రస్తుతం హారిక హాసిని, సితార సంస్థల్లో పావలా వాటాను తీసుకున్నారని తెలుస్తోంది. సర్, మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాల్లో మైహోమ్ కు వాటా వుంటుంది.
ఇదే విధంగా మరి కొన్ని సంస్థలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అవి ఫలవంతం అయితే ఇదే తీరుగా అక్కడ కూడా నిర్మాణాల్లో భాగస్వామిగా మారుతుంది.
మ్యూజిక్ లేబుల్
ఇదిలావుంటే మైహోమ్ సంస్థ ఓ మ్యూజిక్ లేబుల్ ను కూడా ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆదిత్య మ్యూజిక్ మాత్రమే లీడ్ లో వుంది. ఆ మాదిరిగానే మైహోమ్ కూడా ఓ మ్యూజిక్ లేబుల్ ను ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినిమాల అడియో రైట్స్, డిజిటల్ రైట్స్ కొనడం ద్వారా డిజిటల్ మార్కెట్ లోకి అడుగుపెడతారన్నమాట. ఇప్పటికే ఆహా ద్వారా వీడియో స్ట్రీమింగ్ రైట్స్ వ్యాపారంలోకి మై హొమ్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో ఆహా తమిళ ఓటిటి ప్లాట్ ఫారమ్ కూడా ప్రారంభం అవుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.