విద్యాలయాల్లోకి ముస్లిం బాలికలు, యువతులు హిజాబ్ ధరించి రావడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించగా, ఆ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు ధర్మాసనం ఆమోదించింది. విచారణ అనంతరం.. ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ విద్యాలయాల్లోకి హిజాబ్ ధరించి రావడాన్ని ప్రభుత్వం నిషేధించడాన్ని సమర్థించింది.
ఈ రకంగా కర్ణాటకలోని బొమ్మై ప్రభుత్వం తమ అజెండాను అమలు చేయడంలో మరో అడుగు ముందుకు వేసింది. మరి ఈ అంశాన్ని బీజేపీ వాళ్లు కర్ణాటకతోనే వదలకపోవచ్చు. తాము అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ ఈ నిర్ణయాన్ని కమలం పార్టీ అమలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి.
ఈ హిజాబ్ వ్యతిరేక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే తీసుకుంది. బొమ్మై సీఎం అయ్యాకా.. కర్ణాటకలో హిందుత్వ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే హిజాబ్ అంశంపై తెరపైకి వచ్చిందని విశ్లేషకులు వ్యాక్యానిస్తూ ఉన్నారు. ఈ పరిణామాల్లో హైకోర్టు ధర్మాసనం కూడా ఆమోదం తెలపడంతో కాషాయ వాదులకు కొత్త ఉత్సాహం వచ్చినట్టే.
రాష్ట్రాల వారీగా.. బీజేపీ ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇక వేగంగా అడుగులు వేయవచ్చు. తమకు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హిజాబ్ నిషేధం, తాము ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ నిషేధాన్ని విధించమంటూ నిరసనలు వంటివి బీజేపీకి రాజకీయంగా ఉపకరించే అంశాలే కావొచ్చు.