ఓట్ల కోసం తప్ప జనం కోసం రాజకీయ పార్టీలు ఏమీ చేయవా? కరోనా కంటే మహాప్రళయం ఇంకేం ఉంటుంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రాజకీయ పార్టీలు ప్రజానీకం ప్రాణాలను కాపాడేందుకు ఏ మాత్ర చొరవ తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరా, బెడ్స్ అందని వారికి వాటిని సమకూర్చడం, అలాగే మృతదేహాలకు అంతిమ సంస్కారం తదితర వాటిలో రాజకీయ పార్టీలు ఎందుకు భాగస్వామ్యం కావడం లేదనే ప్రశ్నలు, నిలదీతలు పౌర సమాజం నుంచి ఎదురవుతున్నాయి.
ఉదాహరణకు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికనే తీసుకుందాం. ఉప ఎన్నికలో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు గ్రామం మొదలుకుని ఏడు నియోజకవర్గాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశాయి. వాటిని సమన్వయపరచడాకి మరికొన్ని కమిటీలు, ఇలా అనేక స్థాయిల్లో నేతలను నియమించి, తిరుపతి పార్లమెంట్ మొత్తాన్ని నాయకులతో చుట్టుముట్టారు. ఇదంతా ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అనుసరించిన వ్యూహం. ఇంత వరకూ బాగానే ఉంది.
మరి కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో ప్రజల్ని గాలికి వదిలేయడం సబబా? ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి నానా వేషాలు వేసే రాజకీయ నాయకులు, ఇప్పుడు కరోనా మహమ్మారి ధాటికి బిక్కుబిక్కుమని కాలం వెల్లదీ స్తున్న ప్రజానీకానికి ఓ భరోసా ఇచ్చేలా ఎందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఏరు దాటేవరకు ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్నఅన్న చందంగా ఓట్ల సమయంలో మాత్రం ఓటరు దేవుళ్లు అంటూ కొంగు దండాలు పెట్టుకుంటూ వచ్చే రాజకీయ నేతలు, ఓట్లు అయిపోయిన తర్వాత మీ చావు మీరు చావండి అనే రకంగా ప్రవర్తిస్తున్నారని పౌర సమాజం మండిపడుతోంది. రాజకీయ పార్టీల దృష్టిలో ఓటర్లు ఎప్పుడూ బోడి మల్లన్నలే అని అర్థమవుతోందంటున్నారు.
ప్రజలను కేవలం ఓటర్లగా చూడడం వల్లే ఈ సమస్య అని, వారి సమస్యలపై నిబద్ధత ఉంటే రాజకీయ నేతలు ఇంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించే వారు కాదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు, తమకు ఓట్ల బంధం తప్ప మరే అటాచ్ మెంట్ లేదనే భావనే రాజకీయ నేతలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించేలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా విపత్కర సమయంలో శవాలను శ్మశాన వాటికలకు తరలించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ముందుకొస్తున్నారే తప్ప, రాజకీయ నేతలు ఎక్కడా కనిపించడం లేదు. ఇలాంటి వారిని ఇంత కాలం ఆదరిస్తున్న తమకు ఇలాంటి శిక్ష పడాల్సిందేనని ఆవేదనతో ప్రజానీకం తమను తాము తిట్టుకుంటుండం కరోనా తీసుకొచ్చిన మార్పు.