2024 ఎన్నికల నాటికి తనకు ముంచుకొస్తున్నముప్పును అధికార పార్టీ వైసీపీ పసిగడుతోందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీడీపీ-జనసేన పొత్తే అధికార పార్టీ వైసీపీ పాలిట ముప్పు. ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన మధ్య తాజా అవగాహన… భవిష్యత్‌లో వాటి కలయికకు సంకేతాలని చెప్పొచ్చు. నిజానికి బీజేపీ-జనసేన మిత్రపక్షాలు అయినప్పటికీ, ఆచరణలో అలాంటి వాతావరణం ఏదీ కనిపించదు.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలం శూన్యం. ఏదైనా సంఖ్యకు కుడివైపు సున్నా వుంటేనే దానికి విలువ. ఎడమ వైపు వుంటే ఎలాంటి విలువ వుండదు. ఏపీ రాజకీయాల్లో ఈ సూత్రం వర్తిస్తుంది. జనసేన లేదా టీడీపీలకు కుడి వైపు వుంటేనే బీజేపీకి బలం. కేంద్రంలో అధికారంలో వుండడం వల్ల బీజేపీని ఏపీలో రాజకీయ పార్టీలు ఖాతరు చేస్తున్నాయి. అంతే తప్ప, బీజేపీని ఏపీ ప్రజానీకం పట్టించుకోవడం లేదన్నది వాస్తవం.
ఈ వాస్తవాన్ని జనసేనాని పవన్‌కల్యాణ్ గ్రహించినట్టున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ పాలనారీతులు పవన్ కల్యాణ్‌కు అసలు గిట్టడం లేదు. టీడీపీ, తాము వేర్వేరుగా వుంటే అంతిమంగా మరోసారి వైసీపీ లబ్ధి పొందుతుందనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో, శ్రేణుల్లో బలంగా వుంది. అందుకే స్థానిక పరిస్థితులను బట్టి అధిష్టాన పెద్దలతో సంబంధం లేకుండా టీడీపీ, జనసేన కలిసి అధికారాన్ని పంచుకుంటున్నాయి.
ప్రస్తుతం అవకాశం వున్న రెండుమూడు చోట్ల టీడీపీ, జనసేన అధికారాన్ని పంచుకున్నాయి. అవకాశం ఉంటే అన్ని చోట్ల ఇదే పని ఆ పార్టీలు చేసేవి. అధికార పార్టీ ప్రలోభాలకు తలొగ్గకుండా జనసేన, టీడీపీ ప్రజాప్రతినిధులు మండల స్థాయిలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడాన్ని వైసీపీ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే కోస్తా ప్రాంతంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఫలితాలు ఎలా వుంటాయో 2014 అనుభవాలను అధ్యయనం చేస్తే సరిపోతుంది. వైసీపీ ప్రధాన బలమంతా రాయలసీమ, నెల్లూరు జిల్లా, అంతో ఇంతో ప్రకాశం జిల్లా అని చెప్పుకోవచ్చు.
మిగిలిన ప్రాంతాల్లో టీడీపీ ఓటు బ్యాంకు, జనసేనాని పవన్‌కల్యాణ్ సామాజికవర్గం బలంగా ఉంది. కొంత కాలంపాటు అధికారంలో కొనసాగాలంటే ప్రత్యర్థులను సరిగ్గా అంచనా వేసుకోవాలి. అప్పుడే ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలు రచించుకునే అవకాశం వుంటుంది.
టీడీపీతో జనసేన కలిసిపోయిందని తిట్టడం కాదు, దాని వల్ల రాజకీయ లాభనష్టాలను అంచనా వేసుకోవడమే వైసీపీ ముందున్న ప్రధాన అంశం. అది వదిలేసి విమర్శిస్తూ కూచుంటే, ప్రత్యర్థులు తమ పని తాము చేసుకుపోతారు. అంతిమంగా నష్టపోయేది తామేనని వైసీపీ పెద్దలు గ్రహించాలి. ఆ దిశగా ఇప్పటి నుంచే కార్యాచరణకు దిగితేనే ప్రయోజనం.