ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ సాగుతోంది. జగన్ కాస్త ముందుగానే ఎన్నికలకు వెళ్తారనే ఉద్దేశంతో చంద్రబాబు ఆల్రెడీ తన పార్టీ అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టారు.
ఇటు అధికార పార్టీ జనాలు కూడా దాదాపు ముందస్తుపై మానసికంగా సిద్ధంగా ఉన్నారు. అటు సంక్షేమ పథకాలు కూడా 90శాతం అమల్లోకి వచ్చాయి కాబట్టి జగన్ ముందస్తుకు వెళ్లడంలో తప్పులేదంటున్నారు చాలామంది.
కానీ అలా కాస్త ముందుగా ఎన్నికలకు వెళ్లాలంటే ఒకే ఒక అడ్డంకి ఉంది. దాన్ని పూర్తిగా అడ్డంకి అనలేం, అది ముందస్తు ఎన్నికల ఆయుధం కూడా. అదే పోలవరం ప్రాజెక్ట్. ఇది పూర్తయిన తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని జగన్ సర్కార్ భావిస్తోందట.
అధికారంలోకి వచ్చిన రెండేళ్లకి పోలవరం పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చినా.. ఇప్పుడది అనుకున్న టైమ్ కి పూర్తయ్యేలా లేదు. కారణం గత ప్రభుత్వం ''పునరావాసం''లో చేసిన మోసం.
అవును, పునరావాసాన్ని పట్టించుకోకుండా కేవలం మట్టి కట్టలతో మాయ చేసి పోలవరం ప్రాజెక్ట్ కి సందర్శకుల్ని బస్సుల్లో తిప్పి, భోజనాలు పెట్టి నానా హడావిడి చేశారు చంద్రబాబు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కానీ అసలు అక్కడ జరిగిన పనేంటి అనేది తేలలేదు.
అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది, గేట్లు కూడా బిగిస్తున్నారు. వరదనీటితో ఇప్పటికే ముంపు ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. బాధితులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించి, ముంపు ప్రాంత వాసుల్ని తరలించడమే ప్రభుత్వం ముందున్న అతిపెద్ద పని.
కేంద్రం కొర్రీలు వేస్తున్నా..
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్ని కేంద్రానికి అప్పగించకుండా, నిధులు తీసుకుని తామే పనులు చేసుకుంటామని గతంలో చంద్రబాబు మాటివ్వడం కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
కేంద్రం నిధుల విడుదల ఆలస్యం చేస్తున్నా.. రాష్ట్రం పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఆనక ఆ నిధులు ఆలస్యమైతే సర్దుబాట్లకు మరో తలనొప్పి. అప్పటికీ కరోనా సమయంలో కూడా పోలవరం పనుల్ని పరుగులు పెట్టించింది మేఘా సంస్థ. కానీ వందశాతం పనులు పూర్తి చేయడం మాత్రం సాధ్యం కావడంలేదు.
కనీసం ఈ రెండేళ్లలో అయినా పోలవరం పూర్తి చేసి, దాని ఫలాలను ప్రజలకు అందించగలిగితే వైసీపీకి తిరుగుండదు. ఎన్నికలు ముందే వచ్చినా, సమయానికి వచ్చినా పోలవరాన్ని మాత్రం పూర్తి చేయాల్సిందే.
రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ అడ్డుపడుతోంది, మరోవైపు సంగం బ్రిడ్జ్, పెన్నా బ్యారేజి వంటి చిన్న చిన్న పనులన్నీ చివరి దశకు చేరుకున్నా నిధుల కొరత వేధిస్తోంది. ఈ దశలో కనీసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపగల పోలవరాన్ని పూర్తి చేస్తేనే జగన్ ముందస్తు ప్రయోగం పూర్తి స్థాయిలో ఫలిస్తుంది.
జగన్ కూడా దానికోసమే వెయిటింగ్. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి, అప్పుడు ఎన్నికలకు వెళ్లాలనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.