ఎన్నికలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దగ్గరి బంధువులు, స్నేహితులైనప్పటికీ ఓటు వరకూ వచ్చేసరికి అనేక సమీకరణలు పని చేస్తుంటాయి. తమతమ స్థాయిలో అనేక విషయాలను ఆలోచించి చివరికి ఓటు వేస్తుంటారు. ఎన్నికలేవైనా..ఓటర్ల ఆలోచనా తీరు ఒకేలా వుంటుంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం కమెడియన్, నిర్మాత అయిన బండ్ల గణేశ్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌ను మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చిన బండ్ల…జీవితా రాజశేఖర్ ఆ ప్యానల్‌లోకి వచ్చేసరికి నిర్ణయాన్ని మార్చుకున్నారు.
ఆమెకు వ్యతిరేకంగా ఆయన రంగంలో దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా వ్యూహాత్మాకంగా వివాదాస్పద కామెంట్స్ చేస్తూ తనదైన రీతిలో ఆయన ఇప్పటికే ప్రచారాన్ని స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలో ఎన్నికల సమయం దగ్గరపడేకొద్ది ఆయన మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ట్విటర్ వేదికగా ఓటర్లను ఆకట్టు కునే ప్రయత్నం చేస్తున్నారు. బండ్ల పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.
‘ఒకే ఒక్క ఓటు. మా కోసం. మన కోసం. మనందరి కోసం. మా తరఫున ప్రశ్నించడం కోసం’ అని పేర్కొన్నారు. ‘ప్రెసిండెంట్, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీతోపాటు మిగిలిన ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా మీకు ఇష్టమైన వాళ్లను ఎన్నుకోండి. కానీ, జనరల్ సెక్రటరీగా నన్ను గెలిపించండి’ అని ఆయన అభ్యర్థించారు.
ఎందుకంటే ఆయన టార్గెట్ చేసిన ఓటర్లు ప్యానల్‌ను కాదని బండ్లను ఎంత వరకూ ఆదరిస్తారనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ఒకే ఒక్క ఓటు అంటూ బండ్ల గణేశ్ అభ్యర్థన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఓటర్లపై ఎంత మాత్రం పనిచేస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.