టీడీపీ, జనసేన ఒకే మాట, ఒకే బాట అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. మున్ముందు ఆ రెండు పార్టీల మధ్య పొత్తుకు సంకేతంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బద్వేలు ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకున్నట్టు జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రకటించడం, అదే బాటలో టీడీపీ కూడా నడవడం …ఆ రెండు పార్టీల మధ్య భావసారూప్యతకు నిదర్శనంగా చెప్పొచ్చు. కానీ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన ఒక నిర్ణయానికి రాకపోవడం చర్చకు దారి తీసింది.
బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలుస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. జనసేన మద్దతు కోరుతామని ఆయన ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మిత్రపక్ష పార్టీని మద్దతు కోరడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీజేపీ, జనసేన మధ్య పొత్తుపై బద్వేలు ఉప ఎన్నిక మరిన్ని అనుమానాలకు బీజం వేసింది.
ఇదే సందర్భంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశాలున్నాయనే ప్రచారాన్ని బద్వేలు ఉప ఎన్నికలో నిలవకూడదనే ఆ రెండు పార్టీల నిర్ణయం బలపరుస్తోంది. పవన్ మనసెరిగి టీడీపీ నడుచుకుంటోందనేందుకు ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవడమే ఉదాహరణగా చెబుతున్నారు. జనసేన-టీడీపీ కలయిక …తప్పకుండా ఆ రెండు పార్టీలకు ప్రయోజనం కలిగిస్తుంది.
కళ్లెదుటే మరో పార్టీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నా జనసేనను బీజేపీ ఏమీ అనలేని దుస్థితి. మరోవైపు తమ పార్టీ నిర్ణయంపై టీడీపీకి ఉన్న గౌరవం… మిత్రపక్షమైన బీజేపీకి లేకపోవడం ఏంటని జనసేన ప్రశ్నిస్తోంది.
బద్వేలులో బీజేపీకి కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా లేవని, అక్కడ బరిలో నిలిచి ఆ పార్టీ చేయగలిగేది ఏమీ లేదని జనసేన దెప్పి పొడుస్తోంది. బీజేపీ సత్తా ఏంటో బద్వేలు ఉప ఎన్నిక తేలుస్తుందని, అప్పుడు పొత్తులో ఉండాలా? వద్దా? అనేది నిర్ణయమవుతుందని జనసేన నాయకులు చెబుతున్నారు.