కడప జిల్లా బద్వేలులో ఘోర ఓటమి నుంచి తప్పించుకునేందుకు సంప్రదాయమనే సాకును టీడీపీ ఎంచుకుంది. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య అనారోగ్య కారణంగా మృతి చెందడంతో బద్వేలులో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ప్రజాప్రతినిధులెవరైనా చనిపోతే, వారి కుటుంబ సభ్యులనే ఏకగ్రీవంగా ఎన్నుకునేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక సంప్రదాయాన్ని పెట్టుకున్నారు. అయితే నంద్యాల ఉప ఎన్నికలో ఆ సంప్రదాయానికి బ్రేక్ పడింది. వైసీపీ తరపున గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసింతే.
ఆయన ఆకస్మిక మరణంతో నంద్యాల ఉప ఎన్నిక జరిగింది. అది తమ పార్టీ అభ్యర్థి గెలిచిన సీటు అని, అందువల్లే ఏకగ్రీవానికి అంగీకరించేది లేదని వైసీపీ బరిలో నిలిచింది. ఆ తర్వాత తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక విషయానికి వచ్చే సరికి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడిని కాకుండా మరొకరిని ఎంపిక చేయడంతో ప్రతిపక్షాలు బరిలో నిలిచాయి.
బద్వేలు విషయానికి వస్తే డాక్టర్ జి,వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధను తమ అభ్యర్థిగా వైసీపీ చాలా ముందుగానే ఎంపిక చేసింది. ఎన్నికల షెడ్యూల్‌తో సంబంధం లేకుండా ఆమె ప్రచారానికి దిగారు. ఈ విషయం టీడీపీకి బాగా తెలుసు.
టీడీపీ కూడా ఉప ఎన్నిక కోసం చాలా ముందుగానే తమ అభ్యర్థిగా డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్‌ను ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలో టీడీపీకి పరిస్థితులు అనుకూలంగా లేవు. కనీసం ఏజెంట్లుగా పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఈ వాస్తవాన్ని కడప జిల్లా నాయకుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
మరోవైపు జనసేనాని పవన్‌కల్యాణ్ సంప్రదాయాన్ని గౌరవిస్తూ, మానవతా దృక్పథంతో ఆలోచించి ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పవన్ నిర్ణయం టీడీపీకి ఓ మార్గం చూపించినట్టైంది. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశమై పోటీ నుంచి తప్పుకోవాలనే కీలక నిర్ణయం తీసుకుంది.
కిందపడ్డా పైచేయి తమదే అన్నట్టు తాము మొదలు పెట్టిన సంప్రదాయాన్ని కొనసాగించేందుకు బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు టీడీపీ ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది.