మెగాస్టార్ – మెగెలోమేనియా స్టార్

తన మీద కోపంతో తెలుగు చిత్రపరిశ్రమను నాశనం చేయవద్దని పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మామూలు వాళ్లు నవ్వుకుని వూరుకుంటారు. కానీ మానసిక శాస్త్రవేత్తలు దీన్ని మెగెలోమేనియా లక్షణంగా నిర్వచిస్తారు. డిక్షనరీ…

తన మీద కోపంతో తెలుగు చిత్రపరిశ్రమను నాశనం చేయవద్దని పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మామూలు వాళ్లు నవ్వుకుని వూరుకుంటారు. కానీ మానసిక శాస్త్రవేత్తలు దీన్ని మెగెలోమేనియా లక్షణంగా నిర్వచిస్తారు. డిక్షనరీ అర్థం కోసం బాక్స్‌ చూడండి. దానితో బాటు మెగా అర్థం కూడా యిస్తున్నాను. ఎందుకంటే మెగా అనగానే తెలుగువారికి చిరంజీవే గుర్తుకు వస్తారు కాబట్టి. ఆయన సాధించినదెంతో వున్నా నా చుట్టూ చిత్రపరిశ్రమ తిరుగుతుంది అని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు.

ఎంత ఎదిగినా ఒదిగే వున్నాడు. మరి పవన్ తనే పరిశ్రమ సర్వస్వం, తనకు బాధ కలిగిస్తే యావత్తు పరిశ్రమను వేధించినట్లే అని మాట్లాడుతున్నారు. తనను తాను గోప్ప..గా ఊహించుకునే మానసిక ప్రవృత్తినే మెగెలోమేనియా అంటారు. పవన్‌ను చిరంజీవితో ఎందుకు పోల్చాలి? అని ఎవరూ అడగలేరు. ఎందుకంటే చిరంజీవి ఫలానా వారి అబ్బాయిగా రంగంలోకి దిగలేదు. స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి, ఎంతో మంది నటుల్ని తయారుచేసిన, చేస్తున్న కుటుంబానికి మూలపురుషుడు. మరి పవన్? చిరంజీవి తమ్ముడిగానే రంగప్రవేశం చేశారు. అందువలన తన అన్న నుంచి ఏం నేర్చుకున్నారు? ఆయన అలా, యీయన యిలా ఎందుకున్నారు? అనే చర్చ రావడం సహజం.

చిరంజీవి 151 సినిమాలు నటించారు. ఆయన వలననే తెలుగు చిత్రపరిశ్రమ బడ్జెట్ విషయంలో, సాంకేతిక విషయంలో నెక్స్‌ట్ లెవెల్‌కు వెళ్లిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అంటే రచయితలు, దర్శకులు, సహ నటీనటులు లేకుండా ఆయన ఒక్కరే సినిమాలకు ఘనవిజయం చేకూర్చారని అర్థం కాదు. తెలుగు సినిమాలు హీరో ఓరియెంటెడ్‌గా వుంటాయి కాబట్టి చిరంజీవి సినిమాలు, ఆయన తరహా సినిమాలు సూపర్ డూపర్ హిట్లయి, జాతీయ స్థాయికి, ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమా వెళ్లిపోయింది. అందుకే తెలుగు సినిమా వజ్రోత్సవ సభలో ఆయనకు ‘లెజెండ్’ అని పురస్కారం యివ్వబోయారు.

కానీ నటుడు మోహన్‌బాబు అభ్యంతరం తెలిపారు. ‘నేను తనకంటె ఎక్కువ సినిమాలు వేశాను, కాలేజీ నడుపుతూ కొందరి వద్ద ఫీజులు తీసుకోవటం లేదు..’ అంటూ తన ఘనత చెప్పుకొచ్చారు. చిరంజీవి ‘ఇది నటన గురించిన వ్యవహారం, దీనిలో విద్య, సమాజసేవ గురించిన ప్రస్తావన ఏముంది?’ అని వాదానికి దిగలేదు. ‘నిజానికి నాకు యిది యిష్టం లేదు. నా కంటె మహానటులు ఎందరో ఉన్నారని, సినిమా అనేది సమిష్టి కృషి అని ముందే చెప్పాను. కానీ నీ వలననే తెలుగు సినిమా రేంజి పెరిగిందంటూ నన్ను ఒప్పించారు. వేరేవాళ్లని బాధపెట్టి అవార్డు తీసుకోవడం నాకిష్టం లేదు.’ అంటూ అవార్డుని పక్కన పెట్టేశారు. ఎవరు లెజెండో భవిష్యత్తే నిర్ణయిస్తుందని అన్నారు. అది చూసిన ప్రతివారూ చిరంజీవి వినయానికి ముగ్ధులయ్యారు. మోహన్‌బాబు మొరటుతనానికి విస్తుపోయారు.

కాలక్రమేణా మోహన్‌బాబు ధోరణిలో మార్పు వచ్చి, ఆయన ప్రస్తుతం చిరంజీవిని ఆప్తుడిగా చూస్తూ మర్యాద కనబరుస్తున్నారు. మోహన్‌బాబులో మార్పు రావడానికి కారణం – ఎంత రెచ్చగొట్టినా చిరంజీవి సంయమనం పాటించడం, ఓర్పు చూపడం. అందుకే ఆయన మెగాస్టారే కాక, మెగా వ్యక్తిత్వం గల మనిషి కూడా అయ్యారు. అదే సభలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అన్నగారికి అవమానం జరిగిందంటూ ఉద్రేకంతో మోహన్‌బాబును ‘‘తమ్ముడూ..’’ అంటూ సంబోంధించి, ఎత్తిపొడిచారు. దానివలన సాధించినదేమీ లేదనుకోండి. ఇప్పటివరకు పవన్ వేసినది 26 సినిమాలు. గత పదేళ్లలో అంటే 2011 నుంచి చూసుకుంటే వేసినది 10. ఈ పదేళ్లలో ఆంధ్రలో ఆడిన తెలుగు, హిందీ, ఇంగ్లీషు సినిమాల టర్నోవర్లతో పోల్చుకుంటే యీ 10 సినిమాల టర్నోవరు ఒక శాతమైనా వుంటుందా? వీటిలో హిట్లు మూడున్నట్లున్నాయి. మరి యిండస్ట్రీ నంతా ఒంటి చేత్తో నిభాయించేస్తున్నట్లు యీ బిల్డప్ ఎందుకు? పైగా ఆయనొక్కడే హీరోనా? తెలుగులో తక్కిన హీరోలు లేరా? వాళ్ల సక్సెస్ రేటుతో పోలిస్తే యీయన ఎక్కడుంటాడు?

కామన్‌సెన్స్ ఉన్న ఏ మనిషికైనా యీ లెక్కలు చూస్తే అర్థమవుతుంది, సినీ నదీప్రవాహంలో తనూ ఒక తరంగాన్ని అని, ఆటుపోట్లు వుంటాయని, నా కోడీకుంపటీ లేకపోయినా సినిమాలు వస్తూనే వుంటాయి, పోతూనే వుంటాయని. కానీ యీయనకు ఎందుకు తోచటం లేదు? పైకి కనబడే కారణం ఏమిటంటే ఆయన అభిమానుల ఉత్సాహం, ఉద్రేకం చూసి ఆ మాయలో పడిపోతున్నాడని! ఆ మాటకొస్తే చిరంజీవి చూడని అభిమాన సందోహం ఉందా? అన్ని వయసుల వాళ్లనూ ఉర్రూతలూగించిన స్టార్ ఆయన. మరి ఆయన ఆ నిషాలో పడలేదే! పవన్ సినిమాలు ఫ్లాపవుతున్నపుడు ఎక్కడున్నారు యీ అభిమానులు? ఇంటింటికి వెళ్లి అజ్ఞాతవాసి కునికిపాట్లు పడే హాళ్ల వద్దకు లాక్కుని రాగలిగారా?

రాజకీయాల్లో కూడా అభిమానులే తనకు వాలంటీర్లయి పోతారనుకున్నాడు. వాళ్లే సైనికులనుకున్నాడు. వాళ్లు మీటింగులకు వచ్చి ‘కాబోయే సిఎం’ అంటూ రాజుగారికి మత్తెక్కించారు కానీ, ప్రజల్లోకి వెళ్లి పోలింగు బూతుల దగ్గరకు తీసుకు రాలేకపోయారు. ‘మిమ్మల్ని నమ్మి మోసపోయాను.’ అంటూ పవన్ ఓసారి ఆక్రోశించారు. వీళ్ల కేకలు, గోలల మధ్య ఆయనకు సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ పోతోంది. వీళ్ల అరుపుల కోలాహలంలో ఓటర్ల నిట్టూర్పులు ఆయనకు వినబడలేదు. చిరంజీవికి కోట్లాది అభిమానులున్నారు. వారిని ఆయన కట్టడి చేయగలరు. ఎపుడైనా కట్టు తప్పితే, తను దిద్దుబాటు చేసి ఇది కాదు పద్ధతి అని వాళ్లకు చెప్పగలరు. నటుడు రాజశేఖర్‌పై తన అభిమానుల దాడి జరిగినపుడు, తను స్వయంగా వాళ్ల యింటికి వెళ్లి సముదాయించి వచ్చారు. ‘మేం చేసినది మా అభిమాన నటుడికి నచ్చలేదు. ఇంకోసారి యిలా చేయకూడదు’ అని అభిమానులకు సంకేతం వెళ్లిపోయింది.

మరి పవన్ అలా ఎప్పుడైనా ప్రవర్తించారా? లేటెస్టుగా పోసానిపై దాడి జరిగితే పవన్ తన అభిమానులను మందలించారా? పోసాని పరాయివాడు. తన మెగా కుటుంబంలోని యితర హీరోల మీటింగులకు వెళ్లి తన అభిమానులు ‘పవన్ స్టార్, పవర్ స్టార్’ అని అల్లరి చేస్తూ వుంటే పబ్లిగ్గా మందలించారా? వారించారా? ఎంతసేపూ ‘చూస్తూ ఊరుకోమని చెప్పండి.’ అంటూ వాళ్లని రెచ్చగొట్టడమే! తనకే సంయమనం లేనప్పుడు అభిమానులకు సంయమనం ఏం నేర్పుతాడు?

చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు ఎంతో వినయంగా రంగప్రవేశం చేశారు. వైయస్, బాబు యిద్దరూ పాలనాదక్షులే. ఇద్దరి వద్దా నేర్చుకోవాల్సింది వుంది అన్నారు. ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. నేను ఒక కొత్త విధానంలో రాజకీయాలను మార్చాలని వస్తున్నాను. ఆదరించండి అనే అడిగారు. అప్పుడు యువరాజ్యం ప్రతినిథిగా పవన్ ఏమన్నారు? ‘ కాంగ్రెసు వాళ్లని పంచెలూడదీసి పరుగులు పెట్టించండి’ వంటి డైలాగులు కొట్టారు. ఇప్పుడిలాటి యిలాటి రౌడీమాటలు మంత్రుల దగ్గర్నుంచి అంటున్నారూ కానీ ఆ రోజుల్లో పరిస్థితి అలా లేదు. దాని వలన పార్టీకి ఏమేరకు నష్టం కలిగిందో ఎవరూ అంచనా వేయలేదు. అప్పట్లో టిడిపి ఫైర్ బ్రాండ్‌గా పేరు బడిన రోజా ‘అన్న, తమ్ముడు ఎందర్ని పడుక్కోబెట్టుకున్నారం’టూ రెచ్చగొట్టినా, చిరంజీవి బదులివ్వలేదు. నిజానికి ‘నాతో పోలిస్తే నువ్వొక స్టారా?’ అని చిరంజీవి అనలేదు. అనలేదు కాబట్టే రోజా పలుచనైంది.

సున్నితమైన కుటుంబసమస్యలతో చిరంజీవి సతమతమయినప్పుడు తమ్ముడిగా అండగా నిలబడే బదులు పవన్ ఆవేశంగా ప్రవర్తించి ‘ఇతనేం గొడవ తెచ్చిపెడతాడో’ అనే ఆందోళన కలగచేశాడు. ఏళ్లు గడుస్తున్నకొద్దీ మనుష్యులు నెమ్మదిస్తారు. ఆవేశం స్థానంలో ఆలోచన వచ్చి చేరుతుంది. పవన్‌ను చూస్తే ఒక 53 ఏళ్ల వ్యక్తి, పిల్లల తండ్రి మాట్లాడుతున్నట్లు తోస్తుందా? మొన్నటి ప్రసంగంలో కూడా సాయి ధరమ్ తేజ కోమాలో వున్న సంగతి అలా బయటపెట్టవచ్చా? సినిమా ఫంక్షన్‌కి వచ్చి రాజకీయాలు మాట్లాడవచ్చా? తన అసందర్భ ప్రసంగం వలన తన నిర్మాతలకు, యితర టెక్నీషియన్లకు యిబ్బంది తెచ్చిపెడుతున్నాననే యింగితం వుండవద్దా? రాజకీయాలు మాట్లాడదలచుకుంటే దానికి వేరే వేదిక వుంది. ప్రెస్ మీట్ పెట్టి దులిపేయవచ్చు. కానీ అదైతే గంభీరంగా వుంటుంది. ఇక్కడైతే అభిమానుల కేరింతలు కొడుతూంటారు కాబట్టి రెచ్చిపోవచ్చు అనుకున్నారా? చిరంజీవి చాలాకాలం రాజకీయాల్లో వున్నారు, కేంద్రమంత్రిగా కూడా చేశారు. ఇక నటుడిగా అయితే చెప్పనే అక్కర్లేదు, నాలుగు దశాబ్దాల పైన కెరియర్. ఎప్పుడైనా ఒక వేదికపై మరొకదాని గురించి మాట్లాడారా?

చిరంజీవి తన జీవితాన్ని క్లీన్‌షీట్‌లా నడపడమే కాదు, అభిమానుల క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే వ్యక్తి. ‘‘జ్యోతిచిత్ర’’లో పని చేసిన జర్నలిస్టు ఓ వీడియోలో చెప్పారు. వాళ్లకి ఒక బ్రాందీ కంపెనీతో ముఖచిత్రంపై వాళ్ల యాడ్ ఏడాదిపాటు వేసే కాంట్రాక్ట్ కుదిరింది. ఆదాయం వస్తుంది కదాని సరేనన్నారు. మొదటి వారం సంచిక కవరుపై యాదృచ్ఛికంగా చిరంజీవి ముఖచిత్రం. చిరంజీవి వెంటనే పిలిపించి ‘‘నా ఫోటో కింద సిగరెట్టు, మద్యం యాడ్ వుండడానికి వీల్లేదు. నేను వాటిని ప్రమోట్ చేస్తున్నానన్న దురభిప్రాయం నా అభిమానులకి కలిగి, దురభ్యాసాల పాలయ్యే ప్రమాదం వుంది. నా ఫోటో వేస్తే కింద యాడ్ వేయడానికి వీల్లేదు.’’ అని చెప్పారు.

‘‘అయ్యో ఎలాగండి, వాళ్లతో అగ్రిమెంటు అయిపోయింది. ఉల్లంఘిస్తే కేసు పెడతారు. మీరేమో టాప్‌లో వున్నారు. కవరు పేజీ మీద తరచుగా మీ ఫోటో వేయకపోతే పత్రిక అమ్ముడుపోదు. మీరిలాటి కండిషన్లు పెడితే ఎలా?’’ అని పత్రికవాళ్లు మొత్తుకున్నా చిరంజీవి ఒప్పుకోలేదు. ‘‘నా అభిమానుల క్షేమమే నాకు ముఖ్యం.’’ అని గట్టిగా చెప్పారు. జ్యోతిచిత్ర ఒక ఏడాదిపాటు చిరంజీవిని కవరు మీద వేయలేక పోయింది. పొగాకు నమిలితే కాన్సర్ వస్తుందని సినిమా మొదట్లో చూపిస్తూనే వుంటారు. కానీ హిందీ టాప్ స్టార్లు వాటి యాడ్స్‌లో నటిస్తూనే వున్నారు. వారికీ, చిరంజీవికి ఎంత తేడాయో చూడండి. ఆయన మెగాస్టార్ అయ్యాడంటే మామూలుగా అయ్యాడా?

చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టారు. 18% ఓట్లు, 18 సీట్లు తెచ్చుకున్నారు. అప్పట్లో దిగ్గజాల్లా వున్న కాంగ్రెసు, టిడిపిల మధ్య యిద్దరి ఓట్లూ చీల్చుకుని ఆ మేరకు నెగ్గుకురావడం గొప్పే. పైగా అప్పట్లో మీడియా ఆయనపై కులముద్ర వేసేసి ‘అందరివాడు’ కాదు, ‘కొందరివాడు’ మాత్రమే అని ప్రచారం చేసి ఆయన ప్రభావాన్ని గణనీయంగా తగ్గించింది. ఆయన చురుగ్గా రాజకీయాల్లో కొనసాగి వుంటే, క్రమేపీ ఆయన ఓటుబ్యాంకు పెరిగేది. రాజకీయ శూన్యత ఏర్పడినపుడు గణనీయమైన పాత్ర పోషించి వుండేవాడు. కానీ ఆయనకు పార్టీ నడిపే ఓపిక లేకపోయింది. తను రాజకీయాలకు పనికి రానని అనుకుని, పార్టీలో కాంగ్రెసులో విలీనం చేసేసి చేతులు దులుపుకున్నాడు. 18 సీట్లు గెలిచినపుడు కూడా ఆయన ఎన్నడూ అహంకరించలేదు. అవతలివాళ్లని పొడిచేస్తా, నిర్మూలించేస్తా వంటి మాటలు మాట్లాడలేదు.

మరి పవన్? 2014లో బిజెపి-టిడిపి కూటమి గెలుపొందడానికి తనే కారణమని చెప్పుకున్నారు. తనే చంద్రబాబును గద్దె మీద కూర్చోబెట్టినట్లు బిల్డప్ యిచ్చారు. 2019లో సొంతంగా పోటీ చేస్తే వచ్చిన ఓట్ల శాతం ఎంత? 6.7%. ప్రజారాజ్యం ఓట్లశాతంలో దాదాపు మూడో వంతు. అదీ చిరంజీవికి, పవన్‌కు రాజకీయంగా వున్న తేడా! ఇది శాతం ప్రకారం చూస్తే, మరి సీట్ల ప్రకారం? ప్రజారాజ్యానికి 18 వస్తే, జనసేనకు వచ్చినది 1! అంటే 18వ వంతు. నెగ్గిన వ్యక్తి కూడా సొంతబలం మీద నెగ్గినట్లే భావిస్తున్నాడు తప్ప పవన్‌కు విధేయత చూపటం లేదు. ఎందుకంటే పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయాడు. పోనీ అసెంబ్లీ ఎన్నికల తర్వాతైనా లోపాలు సరిదిద్దుకుని, పార్టీని నిర్మించుకుంటున్నారా అంటే అదీ లేదు. స్థానిక ఎన్నికలలో కూడా జనసేన పుంజుకోవటం లేదు. టిడిపి బలంగా వున్న కొన్ని చోట్ల మాత్రమే యిద్దరి బలం కలిసి, జనసేన గెలుస్తోంది. ఉపయెన్నికలలో అభ్యర్థులనే నిలపటం లేదు. దానాదీనా యిప్పుడు వారు ప్రాంతీయ పార్టీ గుర్తింపు, ఎన్నికల గుర్తు పోగొట్టుకున్నారు.

రాజకీయంగా యింత బలహీనంగా తనపై వైసిపి కక్ష తీర్చుకుంటోందని పవన్ ఎలా అనుకుంటున్నారో తెలియదు. వైసిపికి ప్రధాన ప్రత్యర్థి టిడిపి. ఇంత కష్టకాలంలో కూడా 30% ఓట్లు నిలుపుకుంటున్న పార్టీ. దానికి ఆర్థికంగా సాయపడుతున్న వర్గాలను దెబ్బ తీయడానికి వైసిపి కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తే అర్థముంది. రాజకీయంగా సోదిలోకి రాని పవన్‌ను వైసిపి ఎందుకు పట్టించుకోవాలి? పవన్ వెనక్కాల ఓ టీవీ ఛానెల్ వుందా? కనీసం ఒక బిజినెస్ హౌసైనా వుందా? అతని సినిమా కెరియర్‌ను నాశనం చేస్తే వైసిపికి కలిగే లాభమేముంది? సినిమాలను ఆడనిస్తే కనీసం సినిమాల్లో పడి కొట్టుకుంటూ రాజకీయాల వైపు రాడని ఆశపడవచ్చు. సినిమాలను ఆడనీయకుండా చేస్తే, వేరే ఏ పనీ లేక ఆంధ్రలోనే కాపురం పెట్టి, రాజకీయ కార్యకలాపాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించే ప్రమాదం వుంది కదా!

రాజకీయంగా తను ఏమీ చేయలేకపోతున్నానని తెలిసి కూడా పవన్ ‘తాట తీస్తా, తోలు తీస్తా’ వంటి భాష వాడడం ఎబ్బెట్టుగా లేదా? ఏ పార్టీ అధ్యక్షుడైనా అలా మాట్లాడతాడా? లోకాన్ని గమనిస్తే సత్తాలేని వాడే బూతులకు లంకించుకుంటాడు. సత్తా వున్నవాడు ఆచరణకే దిగుతాడు. సినిమా డైలాగుల్లో ఏదైనా చెల్లుతుంది. నిజజీవితంలో చెల్లదు. తెరపై యాంగ్రీ యంగ్‌మాన్‌గా కనబడే అమితాబ్ బచ్చన్ నిజజీవితంలో అతి మర్యాదస్తుడు. చిరంజీవి ఒక సభలో తన కాళ్లకు దణ్ణం పెడుతూంటే వారించాడు కూడా. ఆ విధంగా యిద్దరి ఔన్నత్యం ఒకేసారి రుజువైంది. పవన్‌ తెరజీవితానికి నిజజీవితానికి కన్‌ఫ్యూజవుతూంటారు. గతంలో ఒకసారి నీ దురాగతాలను సహించనంటూ హత్యారాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి వద్దకు తుపాకీ పట్టుకుని వెళ్లి భంగపడి వచ్చారనే పుకారు వుంది. అది నిజమై వుండకపోవచ్చు. నిజమైతే పవన్ రీలుకి, రియల్‌కు మధ్య వున్న తేడా తెలుసుకుని వుండేవారు.

పవన్ ఆలోచనల్లో గందరగోళం స్పష్టంగా కనబడుతుంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో మామూలు శ్రోతలకు అర్థం కాదు. కులం గురించి మాట్లాడడం చికాకు అంటారు. మళ్లీ ఐదు నిమిషాల్లో కాపు, బలిజ.. అంటూ దండకం చదువుతారు. చిరంజీవి యిటువంటి ఆదర్శాలు ఎప్పుడూ వల్లించలేదు. కానీ పిల్లలు యితర కులాల వాళ్లని పెళ్లాడదానని అన్నపుడు అడ్డు చెప్పలేదు. పార్టీ పెట్టినపుడు బిసిల సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు తప్ప తక్కినవాళ్లని తిట్టలేదు. ఇప్పుడు పవన్ రెడ్ల మీద పడ్డారు. రఘురామ రాజు వినోదాత్మకంగా మాట్లాడినంత సేపు విన్నారు, కానీ ప్రత్యేకంగా రెడ్ల గురించి నిందాపూర్వకంగా మాట్లాడినప్పుడు చీదరించుకున్నారు. ఇప్పుడు వినోదం పాలు కూడా తగ్గిపోయింది. ఆ స్థానాన్ని పవన్ అందిపుచ్చుకున్నారు.

ఒక పార్టీ అధ్యక్షుడు కులప్రస్తావన చేయడం తెలివైన పని కాదు. జగన్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రముఖ్యమంత్రి అయి వుండి కూడా కులప్రస్తావన చేశారు. కానీ అది ఒక యిద్దరు వ్యక్తుల మధ్య వున్న బంధాన్ని సూచించడానికై చేశారు. అది వ్యక్తిగతం. కానీ రఘురామరాజు కానీ, పవన్ కానీ మొత్తం కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం, అందునా రాజకీయంగా బలమైన శక్తిగా వున్న రెడ్లను టార్గెట్ చేస్తూ మాట్లాడడం రాజకీయంగా వివేకవంతం కాదు.

పవన్ వేలాది పుస్తకాలు చదివానంటారు. వృత్తిరీత్యా డాక్టరు, నికార్సయిన విప్లవకారుడు, నిజాయితీపరుడు ఐన చెగువేరా తనకు ఆరాధ్యుడంటారు. తెలుగులో ఏ శ్రీశ్రీయో అంటే జనాలకు కాస్త తెలిసేది. గుంటూరు శేషేంద్ర శర్మ పేరు పవన్ ద్వారానే చాలామందికి తెలిసిందనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఎవరాయన? ఒక కవి. విమర్శకుడు. చాలా క్లిష్టమైన కవిత్వం. భార్య సజీవంగా వుండగానే ఇందిరా ధనరాజ్‌గిరి అనే తెలుగేతర ధనికురాలిని పెళ్లి చేసుకున్నారు. ముత్యాలముగ్గులో చూపించిన భవంతి ఆవిడదే. హై క్లాసు మనుషుల మధ్య సాగే విశృంఖల శృంగారం గురించి శర్మగారు ‘‘కామోత్సవ్’’ అని ‘‘ఆంధ్రజ్యోతి’’ వీక్లీలో సీరియల్ రాస్తే అశ్లీలత కారణంగా కోర్టులో కేసులు పడి, సీరియల్ ఆపివేయవలసి వచ్చింది. చెగువేరాకు యీయనకు పోలికే లేదు. పవన్, శేషేంద్ర శర్మ ఔన్నత్యాన్ని వివరించడానికి ఆయనకూ, కృష్ణశాస్త్రికి, శ్రీశ్రీకు, సినారెకు పోలిక పెట్టి వివరించి చెప్పరు. అందుకని తక్కిన కవిత్వాలపై పవన్‌కున్న అవగాహన ఎంతో మనకు ఎప్పటికీ తెలియదు. పుస్తకాలు చదివితే భాషాజ్ఞానం పెరుగుతుంది. మాటల పదును తెలుస్తుంది. ఎప్పుడు చూసినా తాట తీస్తా, తోలు తీస్తా డైలాగులే కదా. నర్మగర్భంగా, చమత్కారంగా మాట్లాడిన సందర్భమేముంది? అసలా చదువంతా ఎక్కడకు పోతోందో తెలియదు,

పవన్‌లో భావస్థిరత్వం కానరాదు. ఎప్పుడూ అశాంతితో, అసంతృప్తితో వున్నాను అంటారు. 53 ఏళ్లు వచ్చాయి కాబట్టి రాజకీయాల్లోనైనా సిద్ధాంతస్థిరత్వం చూపించాలి కదా. లెఫ్టా, రైటా, సెంటరా? ఏదో ఒక ఒడ్డుకు చేరాలి. లెఫ్ట్‌తో పొత్తు పెట్టుకుంటారు, కొన్నాళ్లకు బిజెపితోనూ పెట్టుకుంటారు. కులరాజకీయాలంటే అసహ్యం అంటారు, అదే ప్రాతిపదికపై పుట్టిన బియస్పీతో పొత్తు పెట్టుకుంటారు. ఈ లెక్కన చంద్రబాబుగారే యీయన దగ్గర పాఠాలు నేర్వవలసి వస్తుంది. పవన్‌కున్న రాజకీయ పరిజ్ఞానం గురించి, పొలిటికల్ హిస్టరీపై అవగాహన గురించి ఎవరికీ తెలియదు. ఆయన ప్రశ్న వేస్తాడు కానీ ఎదుటివాడు ప్రశ్న వేస్తే జవాబివ్వడు, తాట తీస్తా అంటాడంతే. ఒక డిబేట్‌లో పాల్గొంటే యీయన కున్న పరిజ్ఞానమేమిటో తెలుస్తుంది. ఏకపాత్రాభినయంలో ఏం తెలుస్తుంది?

పవన్‌ రాజకీయాల్లో గ్రీన్‌హార్న్ కాబట్టి నిపుణుల సలహాలు తీసుకోవలసిన అవసరం వుంది. గతంలో ఒకసారి జెపి, ఉండవల్లి, ఐవైఆర్ వంటి వారితో ఓ కమిటీ వేశారు. దాని సిఫార్సులు ఫార్సుగా మిగిలాయేమో తెలియదు కానీ, అటువంటివి చేస్తే సాధారణ ప్రజల్లో ‘ఇతనికి నేర్చుకునే ఉద్దేశం వుంది’ అనే అభిప్రాయం కలుగుతుంది. కరోనా సమయంలో వైద్యులతో ఓ కమిటీ వేసి, వారి సూచనలను జనసేన పార్టీ తరఫున రెండు ప్రభుత్వాలకు అందచేశాం అంటే ఎంత హుందాగా వుండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తోంది. నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలతో ఓ వైట్ పేపరు వేస్తే ఆ గౌరవమే వేరు కదా!

సినిమాలలో తనే అన్నీ చేస్తానంటాడు, డైరక్షన్ చేసిన సినిమాలన్నీ దెబ్బ తిన్నా యింకా కలగజేసుకుంటూనే వుంటాడు. రాజకీయాల్లోనూ డెలిగేషన్ లేదు. అందుకే పార్టీ పెట్టి యిన్నేళ్లయినా నిర్మాణం లేదు. చర్చలు లేవు. సంస్థాగత ఎన్నికలు లేవు. కాస్త సరుకున్నవాళ్లు ఆయన పార్టీలో నిలవరు, ఆయన గ్లామరు, తమ మేధస్సుతో కలిసి గెలిపిస్తాయనుకున్ని పార్టీలోకి వచ్చిన కొందరు మేధావులు ఆయన గ్లామరు ఆయనకే పనికి రాలేదని తేలిపోయాక తప్పుకున్నారు. కరోనా టైములో ఆయన బయటకు రాలేదు కానీ అభిమానులు వర్క్ చేశారు. వారికి కాష్ ప్రైజెస్ లాటివి యిస్తే హుషారుగా వుండేది. ఎంతసేపూ తన మార్కెట్, తన రెమ్యూనరేషన్ ఎక్కడ తగ్గిపోతుందోననే చింతే తప్ప, యింకోడికి యిచ్చే ఉద్దేశం లేదు.

చిరంజీవి చూడండి, సినీపరిశ్రమకు పెద్దగా గుర్తించబడ్డారు. అవసరమైనవాళ్లను ఆదుకుంటున్నారు. ఏ వివాదంలోకి దిగరు. ఆయనను విమర్శించడానికి కూడా ఎవరికీ ముందుకు రాదు. అవినీతికి ఆలవాలమైన యుపిఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా వున్నపుడు కూడా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రాలేదు. ఏ వివాదంలోనూ చిక్కుకోలేదు. అదీ హుందాతనం. తనే సర్వశక్తిమంతుడనే భ్రమల్లోంచి బయటకు వచ్చి అన్నగారి మార్గాన్ని అనుసరిస్తే పవన్‌కు భవిష్యత్తు వుంటుంది. లేకపోతే కొన్ని రోజుల కాలక్షేపం అందించడానికి మాత్రమే పనికి వస్తాడు. ఇది రాజకీయాలకు సంబంధించినంత వరకు మాత్రమే. నటుడిగా ఆయన రాణిస్తూనే వుంటాడని, వుండాలని కోరుకుందాం.