వెన్నుపోటుపై టీడీపీకి పేటెంట్ హక్కులున్నాయని సరదాగా చెబుతారు. దీనికి కారణం… దివంగత ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్ను పోటు పొడిచి అధికారాన్నే లాక్కోవడమే. అప్పటి నుంచి చంద్రబాబును వెన్నుపోటు బాబు అని పిలవడం ప్రత్యర్థులకు అలవాటైంది. అలాంటి టీడీపీకి జనసేన వెన్నుపోటు పొడవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. జనసేన వెన్నుపోటుపై ఆకివీడు టీడీపీ రగిలిపోతోంది.
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఈ నగర పంచాయతీలో 20 వార్డులున్నాయి. వైసీపీ 12 స్థానాల్లో గెలుపొంది చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆకివీడు నగర పంచాయతీలో ఎలాగైనా అధికార వైసీపీని ఓడించాలని ప్రతిపక్షాలు ఒక్క తాటిపైకి వచ్చాయి. టీడీపీ, జనసేన, సీపీఎం మధ్య పొత్తు కుదిరింది. బీజేపీ బరిలోనే లేదు.
20 వార్డుల్లో మూడు పార్టీలు సీట్లను పంచుకున్నాయి. టీడీపీ -13, జనసేన-5, సీపీఎం-2 స్థానాల్లో తలపడ్డాయి. నువ్వానేనా అన్నట్లు జరిగిన పోటీలో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని చాలా మంది భావించారు. కానీ ప్రతిపక్షాల ఆశలను తాజా ఫలితాలు తలకిందలు చేశాయి.
టీడీపీ 4, జనసేన 3 చోట్ల గెలుపొందాయి. జనసేన అభ్యర్థులకు టీడీపీ కార్యకర్తలు ఓట్లు వేయడంతో ఐదింటిలో మూడు చోట్ల గెలుపొందారు. కానీ టీడీపీ అభ్యర్థులకు జనసేన ఓట్లు పడలేదు. అందువల్లే 13 చోట్ల పోటీ చేస్తే కేవలం 4 సీట్లలో మాత్రమే తాము గెలిచామని టీడీపీ నాయకులు వాపోతున్నారు.
పాత విషయాలు గుర్తు పెట్టుకుని తమపై జనసేన కక్ష తీర్చుకుందని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. జనసేన నాయకులు మనస్ఫూర్తిగా తమ అభ్యర్థుల గెలుపు కోసం పని చేసి వుంటే …ఫలితాలు ఇంత అధ్వానంగా ఉండేవి కావని టీడీపీ నాయకుల ఆవేదన. మొత్తానికి ఆకివీడులో నగర పంచాయతీ ఫలితాలు టీడీపీ-జనసేన మధ్య చిచ్చు రగిల్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.