రాష్ట్రంలో పురపాలక ఎన్నికల పర్వం ముగిసింది. ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చాయి. సంక్షేమ పథకాల ప్రభావమా.. లేదా జగన్మోహన రెడ్డి అందించగల పరిపాలన మీద, తద్వారా భవిష్యత్తు మీద ప్రజలకు మంచి నమ్మకం ఉన్నదా.. కారణాలు ఏమైనా గానీ.. అధికార పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
తిరుగులేని సంఖ్యలో అత్యధిక స్థానాలను అందించారు. కేవలం విజయాలు మాత్రమే కాదు. చాలా స్వల్పంగా కొన్ని వార్డులు మినహా ప్రతి చోటా ఘనమైన మెజారిటీలను కూడా కట్టబెట్టారు. నిజానికి ఇతర పార్టీల్లో ఉంటూ భవిష్యత్ రాజకీయ పరిణామాలు, బలాబలాలు ఎలా ఉంటాయో అని డోలాయమానంలో ఉండే వారు తట్టాబుట్టా సర్దుకునే రీతిలో ఈ పుర ఫలితాలు ఉన్నాయి.
ఇప్పుడు పోస్టుమార్టం పర్వం. ఈ ఫలితాలను ముందరేసుకుని.. మంచీ చెడూ తూకం వేసుకోవడంలో.. ఎవరు ఎలాగెలిచారో, ఎలా ఎవరి మీద నిందలు వేయవచ్చో.. తమ బలం తగ్గలేదని ఎన్ని రకాల వంకర విశ్లేషణలతో సమర్థించుకోవచ్చో ఆలోచించే పనిలో నాయకులు బిజీబిజీగా ఉంటారు. ఈ తరుణంలో బీజేపీ నాయకులు ఏం మల్లగుల్లాలు పడుతున్నారో కూడా ఆసక్తికరమైన అంశమే.
భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వచ్చేస్తాం అన్నట్టుగా డైలాగులు వల్లిస్తుంటుంది. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలూ అవినీతి పార్టీలే..ఇలాంటప్పుడే మనం ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి అని అమిత్ షా కూడా వారికి చెప్పారు. వాళ్లలో కూడా కొందరికి అలాంటి ఆశలు ఉండొచ్చు.
తమంత తమకు ఏపీలో ఎప్పటికీ ఠికానా ఉండదనే సత్యం కమల దళపతులకు బాగానే తెలుసు. అందుకే వారు జనసేనతో అంటకాగుతున్నారు. తమ మోడీ ఆదరణకు, పవన్ కల్యాణ్ కుండే జనబలం కూడా తోడైతే.. మంచి స్కోరు నమోదు చేయగలం అనేది వారి ఆశ. అందుకే ఇద్దరి మధ్య పొత్తు.. అవకాశవాద పొత్తే అయినా.. ఏదో అలా సాగుతూతూతూ ఉంది.
కానీ.. ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత కూడా.. జనసేనకు, పవన్ కల్యాణ్ కు ప్రజల్లో బలం ఉందని బీజేపీ నమ్మగలదా? అనేది డౌట్! ఈ ఎన్నికల పర్వంలో జనసేన అనే పార్టీ ఒకటి ఉన్నదని ప్రజలు మరిచిపోకుండా ఉండడానికి తగినన్ని సీట్లు మాత్రమే వారికి దక్కాయి. ఆ పార్టీ చాలా పూర్ గా పెర్ఫార్మ్ చేసింది. బీజేపీ ఏం ఆలోచిస్తుంటుందో మరి.
రాష్ట్రంలో మొత్తం 353 స్థానాలకు ఎన్నికలు జరిగితే అందులో వైసీపీకి 261 స్థానాలు వచ్చాయి. తెలుగుదేశం అందులో మూడో వంతు కంటె తక్కువ.. 82 సీట్లకు పరిమితం అయింది. నానా హడావుడి చేస్తూఉండే జనసేనకు దక్కింది కేవలం 5 సీట్లు. స్వతంత్రులకు కూడా అన్నే వచ్చాయి. 353 సీట్లలో కేవలం 5 దక్కడం అంటే… జనసేన నమోదు చేయగల విజయాల శాతం 1.5 కంటె చాలా తక్కువ. ఆ మాత్రం విజయాలతో వారు ఏం అద్భుతాలు చేయగలరు.
అందుకే పవన్ కల్యాణ్ బలం గురించి కూడా బీజేపీలో ఉన్న ఆశలు ఈ ఎన్నికలతో ఉడిగిపోయి ఉంటాయి. సీఎం కుర్చీలోంచి మీకు సేవలందిస్తా అని చెప్పే పవన్ కల్యాణ్ కు కూడా ఇంకాస్త క్లారిటీ వచ్చి ఉంటుంది.