టీడీపీ భవిష్యత్ కిషోరం నారా లోకేశ్ బుర్రే బుర్ర. ఆయన బుర్ర ఎంత పదునైందో… తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకూ ఎవరికీ తెలుసుకునే అవకాశం లేకపోయింది. చివరికి ఆయన్ను పుట్టించిన చంద్రబాబుకు కూడా లోకేశ్ బుర్రలో ఇంత మేథస్సు ఉన్నదా అని తెలిసి వుండదేమో! దేనికైనా సమయం రావాలని పెద్దలు ఎందుకు చెప్పారో, ఇప్పుడు లోకేశ్ బుర్ర గురించి తెలిసొచ్చిన తర్వాతే గానీ అర్థం కాలేదు. లోకేశ్ బుర్రతో చూస్తే… టీడీపీ ఓటములన్నీ విజయాలుగా కనిపిస్తాయి.
ఇటీవల ఏపీలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు మరో 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. గతంలో వివిధ కారణాల వల్ల వీటికి ఎన్నికలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరుగుతోందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. నామినేషన్లు మొదలుకుని ప్రచారం, ఆ తర్వాత ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.
మరీ ముఖ్యంగా ఈ విడతలో కుప్పం మున్సిపాలిటీ కూడా ఉండడంతో ఎన్నికలకు అత్యధిక ప్రాధాన్య ఏర్పడింది. దర్శిలో మినహా మరెక్కడా టీడీపీ సత్తా చాటలేకపోయింది. చివరికి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోని కుప్పం మున్సిపాలిటీలో కూడా వైసీపీ పాగా వేయడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఫలితాలపై నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు.
“రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఫ్యాన్‌కి వ్యతిరేకంగా జగన్‌ను తిరస్కరించారనే విషయం బులుగు బుర్రలకి ఎప్పుడెక్కుతుంది?. ప్రజలు లోకేశ్ రెండు చెంపలు పగలగొట్టారనే భ్రమల్లో వైసీపీ నేతలు ఉన్నారు. దొంగ ఓట్లు, వందల కోట్లు, గూండాగిరీ, అధికారులు, పోలీసుల అండతో కుప్పంలో గెలిచామని వారు తెలుసుకోవాలి” అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ఇదే కుప్పంలో టీడీపీ ఆరు చోట్ల గెలుపొందింది. మరి ఇక్కడి గెలుపు గురించి లోకేశ్ ఏం సమాధానం చెబుతారని నెటిజన్లు, ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కుప్పం మినహా మిగిలిన చోట్ల వైసీపీ, అలాగే దర్శిలో తన పార్టీ విజయాల గురించి లోకేశ్ ఎందుకు మాట్లాడ్డం లేదు. అలాగే కొండపల్లిలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ ఫైట్ జరగడం, ఇద్దరికీ సమాన సీట్లు రావడంపై లోకేశ్ ఎందుకు ట్వీట్ చేయడం లేదనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అయినా ఫ్యాన్‌కి వ్యతిరేకంగా జగన్‌ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని లోకేశ్ ఏ లెక్కలతో చెబుతున్నారో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. జగన్‌ను తిరస్కరించారనే విషయం బులుగు బుర్రలకి ఎప్పుడెక్కుతుందని లోకేశ్ ప్రశ్నించడం ఆశ్చర్యపరుస్తోంది. పోనీ ఆ విషయాల్ని అర్థం చేసుకునే పచ్చబుర్రలేంటో కాస్త అరువుకు ఇవ్వయ్యా సామి అని ప్రత్యర్థులు కోరుతున్నారు.