జనసేనాని పవన్‌కల్యాణ్ పనే హాయిగా ఉంది. రాజకీయాల్లో ఆయన ఉన్నారంటే ఉన్నారు, లేరంటే లేరు. ఏడేళ్ల క్రితం ప్రశ్నించడానికి అంటూ జనసేన పార్టీని స్థాపించారు.
అంతకు ముందు తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీలో పవన్‌కల్యాణ్ యువరాజ్యానికి నాయకత్వం వహించి క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత రోజుల్లో కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనం కావడంతో పవన్ సైలెంట్ అయ్యారు. కానీ ఆయనలోని రాజకీయ ఆకాంక్ష చావలేదు.
మరోసారి రాజకీయ తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకొచ్చారు. ఆయనలో ఆశయం ఉన్నంత బలంగా ఆచరణ లేదు. ఇందుకు ఎన్నైనా ఉదాహరణలు చెప్పొచ్చు. పార్టీ స్థాపించి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించేందుకు ఏ మాత్రం ప్రయత్నిం చలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు పలికి, వాళ్ల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించి హాయిగా చేతులు దులుపుకున్నారు.
ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీలతో పొత్తు పెట్టుకుని బరిలో నిలిచారు. చివరికి తాను నిలిచిన రెండు చోట్ల కూడా ఓడిపోయారు. మళ్లీ బీజేపీతో అధికారిక పొత్తు. టీడీపీతో అనధికారిక పొత్తులో ఉన్న ఏకైక నాయకుడిగా పవన్‌కు ప్రత్యేక గుర్తింపు. వెండితెరపై పవన్ డబుల్ రోల్ సంగతేమోగానీ, రాజకీయ తెరపై మాత్రం ద్విపాత్రాభినయం అద్భుతం. కానీ ఆయన అదృష్టం ఏంటే… ఎక్కడా ఆయనకు కోటలు లేవు. దీంతో బీటలు పడే అవకాశం అసలే లేదు.
తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో అడపాదడపా జనసేనకు సీట్లు వచ్చాయి. ఆకివీడు, గురజాల తదితర చోట్ల సింగిల్ డిజిట్‌లో సీట్లు లభించాయి. ఏమీ లేని పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా అదనమే అనే సంతోషంలో జనసేన నాయకులున్నారు. అందుకే తాజా ఫలితాలపై జనసేన నాయకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ లాగా కుప్పం, పెనుకొండ లాంటి కంచుకోటలు బద్దలయ్యాయనే బాధ జనసేనకు ఏమాత్రం లేదు. జనసేనది అదో తుప్తి… అది అంతే.