రాయలసీమలో జన సైనికుల దందా

రాజకీయ పార్టీలేవీ విరాళాలు, చందాలు లేకుండా మనలేవు. చిన్నదైనా, పెద్దదైనా పార్టీకి కావాల్సిన ముడి సరుకు చందాలే. పాపం జనసేన కూడా రాజకీయ మనుగడ కోసం, చందాల కోసం బాగానే కష్టపడుతుంది. పవన్ కల్యాణ్…

రాజకీయ పార్టీలేవీ విరాళాలు, చందాలు లేకుండా మనలేవు. చిన్నదైనా, పెద్దదైనా పార్టీకి కావాల్సిన ముడి సరుకు చందాలే. పాపం జనసేన కూడా రాజకీయ మనుగడ కోసం, చందాల కోసం బాగానే కష్టపడుతుంది. పవన్ కల్యాణ్ ఏకంగా తన తల్లి, అన్నయ్య దగ్గర చందాలు తీసుకుని మరీ వసూళ్లకు సెంటిమెంట్ అనే ఆయింట్ మెంట్ పూశారు.

ఆ సంగతి పక్కనపెడితే అనధికారికంగా జనసైనికులు కూడా ఎన్నికల సమయంలో బాగానే వెనకేసుకున్నారని వినికిడి. ఈ విషయం తెలిసే పవన్ అంతా ఆన్ లైన్ సిస్టమ్ తీసుకొచ్చారు. కానీ రాయలసీమ పర్యటనలో మాత్రం జనసైనికులు మరీ రెచ్చిపోయారని స్థానిక వర్గాల సమాచారం.

ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్లను టార్గెట్ చేసుకుని వసూళ్లకు తెగబడ్డారట. ఎటూ పవన్ కల్యాణ్ ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి, అది పరోక్షంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలకు మేలు చేసేదే కాబట్టి.. జనసైనికులు వారినే టార్గెట్ చేశారు.

కడప, చిత్తూరు జిల్లాల్లో పవన్ మనుషులు ప్రైవేట్ స్కూళ్ల దగ్గర ఫండ్ సేకరించారు. కొన్నిచోట్ల యాజమాన్యాలు మాట వినకపోతే బెదిరించి మరీ వసూళ్లుకు తెగబడ్డారని వినికిడి. ఓవైపు పవన్ మాత్రం కెమెరా ముందు మహ బాగా నటిస్తుంటారు.

అన్యాయాలు, అక్రమాలు జరిగిపోతున్నాయని, సీమని దోచుకున్నారని రెచ్చిపోతుంటారు. మరోవైపు జనసైనికులేమో ఆ దోచుకునే పనిలోనే మునిగి తేలుతున్నారు.

కేవలం రాయలసీమలోనే కాదు, ఇప్పటికే పలు జిల్లాల్లో జనసేన కార్యకర్తలు, చోటా మోటా నేతల బాగోతాలు బాగానే వెలుగులోకి వచ్చాయి. ఆమధ్య నెల్లూరు జిల్లాలో ఓ కార్పొరేట్ కాలేజీ వద్ద జనసేన నేత వసూళ్లకు పాల్పడితే, అతడ్ని ఇంచార్జిల లిస్ట్ లో నుంచి పక్కనపెట్టేశారు. అటు ఉత్తరాంధ్రలో కూడా ఇలాంటి వ్యవహారాలున్నాయి. కానీ కొన్నిచోట్ల, కొందరిపై మాత్రమే క్రమశిక్షణ వేటు పడిందనేది వాస్తవం.

అంటే స్థానికంగా కలెక్షన్ చేసుకుంటూ వాటా పైకి పంపుతూ ఉంటే ఎవరికీ ఎలాంటి సమస్యా ఉండదన్న మాట. అలా కాకుండా కక్కుర్తిపడి అంతా తమకే కావాలనుకునే వారికి పదవులివ్వకుండా పక్కనపెట్టేస్తోంది జనసేన పార్టీ. మరి రాయలసీమ వసూళ్లు పవన్ కి తెలిసి జరిగాయో లేక తెలియకుండా జరిగాయో కొన్నిరోజుల్లో జనసేన రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది.