పాపం నారాయణ.. ఎవ్వరూ పట్టించుకోరేం!

గత ప్రభుత్వంలో నారాయణ కీలక మంత్రి. ఆర్థిక అండదండలు మెండుగా ఉంటాయని, పార్టీ విజయం కోసం పని చేశారని ఏరికోరి ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రిని చేశారు. ఆ టైమ్ లో ఓ వెలుగు…

గత ప్రభుత్వంలో నారాయణ కీలక మంత్రి. ఆర్థిక అండదండలు మెండుగా ఉంటాయని, పార్టీ విజయం కోసం పని చేశారని ఏరికోరి ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రిని చేశారు. ఆ టైమ్ లో ఓ వెలుగు వెలిగారాయన. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్.

సొంత బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ నారాయణ పార్టీకి దూరమయ్యారు. అటు టీడీపీ కూడా ఆయన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. ఎంతలా అంటే.. ఏకంగా ఆయనపై దాడి జరిగినా పట్టించుకోలేనంత. నారాయణ చొక్కా పట్టుకొని బయటకు లాగినా తమకేం తెలియనంత.

చంద్రబాబు బస్సుపై చెప్పు పడితేనే నానా రాద్ధాంతం చేస్తూ గవర్నర్ ని కలిసి మరీ శాంతి భద్రతల సమస్య ఉందని నెత్తీనోరూ బాదుకుంటున్న టీడీపీ నేతలు, నారాయణపై జరిగిన అటాక్ గురించి కనీసం నోరు విప్పలేదు, సానుభూతి తెలపలేదు.

ప్రియ శిష్యుడు అనుకునే లోకేష్ కూడా ఈ విషయంపై సైలెంట్ గా ఉన్నారు. కేవలం నెల్లూరు జిల్లాలోని ఒకరిద్దరు చోటామోటా నాయకులు నారాయణపై సింపతీ చూపించి ఆ దాడిని ఖండించారు. ఇంకెక్కడా నారాయణ ప్రస్తావనే రాలేదు.

నారాయణపై దాడి చేసింది విద్యార్థి సంఘాల నాయకులా, ఆయన సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగులా, వైసీపీ స్థానిక నేతలా అనే విషయంపైనే ఇంకా క్లారిటీ రాలేదు. చిన్నదైనా, పెద్దదైనా దాడి జరిగిందనే విషయం మాత్రం వాస్తవం.

దీనిని టీడీపీ పూర్తిగా పట్టించుకోలేదన్న విషయం కూడా వాస్తవం. దాదాపుగా నారాయణ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు, కేవలం విద్యాసంస్థల వ్యాపారంపైనే దృష్టిపెడుతున్నారు. సీఆర్డీఏలో కీలకంగా ఉన్నారు కాబట్టి, రాజధాని పర్యటనలో తళుక్కున మెరిశారు కానీ, మిగతా చోట్ల నారాయణ హాజరు పూర్తిగా శూన్యం.

అందుకే టీడీపీ నేతలు కూడా నారాయణను లైట్ తీసుకున్నారు. అయితే ఈ దాడి విషయంపై ఎవరూ నోరు మెదపకపోవడానికి కారణం కూడా నారాయణే అంటున్నారు. ఈ దాడి విషయం బైటకు పొక్కకుండా ఉంటేనే మంచిదని ఆయన భావిస్తున్నారట.

అందుకే కేసు పెట్టేందుకు సైతం సాహసించలేదట. పరువు పోవడం ఒక ఎత్తైతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలపై దాడులు జరిగే అవకాశం ఉంటుందని నారాయణ వెనక్కి తగ్గారు.

కారణం ఏదైనా అధినేత వాహనంపై చెప్పు పడితే నెత్తీనోరూ బాదుకుంటున్న నేతలు, మాజీ మంత్రిపై చేయిపడితే మాత్రం సైలెంట్ గా ఉన్నారు. అదే టీడీపీ మార్కు రాజకీయం అంటే..!